కేసీఆర్‌తో ఒప్పందం: పవన్‌కు 'ఉద్యమం' షాక్, కొండగట్టు వస్తే.. పొన్నం హెచ్చరిక
కరీంనగర్/హైదరాబాద్: జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరంతర ప్రజాయాత్ర (చలోరే చలోరే చల్) సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ఆయన తన యాత్రను ప్రారంభిస్తారు. ఆయన నేరుగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చేరుకుంటారు.
ఆలయంలో అంజన్నకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత తన యాత్ర ప్రణాళికను వెల్లడిస్తారు. సాయంత్రం కరీంనగర్ చేరుకుని జనసేనకు చెందిన స్థానిక ముఖ్య ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ నెల 23న కరీంనగర్‌లోని జగిత్యాల రోడ్డులో ఉన్న శుభం గార్డెన్స్‌లో ఉదయం పదకొండు గంటల సమయంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు.

ఖమ్మం నుంచి తిరిగి హైదరాబాద్
అనంతరం మధ్యాహ్న భోజనం తర్వాత కొత్తగూడెం వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకొని, మూడు గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో జరిగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి పయనం అవుతారు.

అప్పుడే హెచ్చరికలు
ప్రజా సమస్యలను అధ్యయనం చేసేందుకు పవన్ కళ్యాణ్ సోమవారం నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో అప్పుడే తెంగాణ నేతల హెచ్చరికలు జారీ అయ్యాయి. తన యాత్ర పర్యటన వివరాలను కొండగట్టులో ప్రకటిస్తానని పవన్ పేర్కొన్న విషయం తెలిసిందే.

తెలంగాణ ఉద్యమం సమయంలో చేసిన వ్యాఖ్యలపై
దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ తలపెట్టనున్న యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.

కోదండకు నో.. పవన్‌కు ఎలా, చీకటి ఒప్పందం
కొండగట్టులో మొక్కు తీర్చుకునేందుకు పవన్ వస్తే తమకు అభ్యంతరం లేదు కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే మాత్రం ఊరుకోమని పొన్నం హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తానంటే కోదండరాంకు అనుమతివ్వని కేసీఆర్ ప్రభుత్వం, పవన్ చేపట్టనున్న యాత్రకు ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్- పవన్ మధ్య కుదిరిన చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలన్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే పవన్ యాత్రకు అనుమతిచ్చారన్నారు.

పవన్ కళ్యాణ్ యాత్ర
కాగా, పవన్ సోమవారం నుంచి తెలంగాణలోని మూడు జిల్లాల్లో రాజకీయ యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. రేపు దర్శనం తర్వా యాత్ర ఎలా చేయాలనేది వెల్లడిస్తానని పవన్ తెలిపారు.కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర వల్ల ఎక్కువ మంది జనాలను కలిసే అవకాశం ఉండదన్నారు. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా కొండగట్టు వద్ద జరిగిన పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని, తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం వల్లే యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ శనివారం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications