తొలిరోజు కేవలం 82 రిజిస్ట్రేషన్లు... సులభతరమైన ప్రక్రియే... కానీ ఇవీ సమస్యలు..
మూడు నెలల తర్వాత రాష్ట్రంలో ఎట్టకేలకు వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం(డిసెంబర్ 14) నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడం గమనార్హం. ఇందులో అత్యధికంగా ఉప్పల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 7 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిచోట్ల ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. స్లాట్ల బుకింగ్‌లో సమస్యలు,సర్వర్లు డౌన్ అవడం తదితర సాంకేతిక కారణాలతో తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Recommended Video

సులభతరమైన ప్రక్రియ... కానీ
ఈనెల 11 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్లతో పాటే మ్యుటేషన్లు కూడా పూర్తవుతున్నాయి. మొత్తం ప్రక్రియ 15-20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఆ తర్వాత కొనుగోలుదారుల సెల్‌ఫోన్‌కు 'ఈ పాస్‌బుక్' వస్తుంది. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్లు సులభతరంగా ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలే ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని పరిష్కరించగలిగితే ఈ ప్రక్రియతో చాలా సమయం ఆదా అవుతుందని ప్రజలు కోరుతున్నారు. కొంతమంది ప్రజలు అవగాహన లేక స్లాట్ బుక్ చేసుకోకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు.

ఇవీ సమస్యలు
స్లాట్ బుకింగ్ సమయంలో సర్వర్లు డౌన్ అవుతుండటంతో బుకింగ్ ప్రక్రియకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని సాధారణ ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం భవనాలు, ఫ్లాట్లు, మార్ట్‌గేజ్, గిఫ్ట్ డీడ్‌లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించగా ఎల్‌ఆర్ఎస్ లేని ఓపెన్ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కావట్లేదు. ఎల్ఆర్ఎస్ ఉన్న ఓపెన్ ప్లాట్లకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్(వీఎల్టీ) వసూలుకు కేటాయించే ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్(పీఐటీఎన్) ఉంటేనే కొత్త విధానంలో స్లాట్ బుక్ అవుతోంది. అయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలియక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎల్‌ఆర్ఎస్ ఉన్నప్పటికీ...
డీటీసీపీ, హుడా,హెచ్‌ఎండీఏ లేవుట్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ ఉన్నప్పటికీ... ధరణి పోర్టల్‌లో నమోదైన ఆస్తులు,భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ వైబ్ సైట్ సహకరిస్తోందని తెలుస్తోంది. దాంతో ధరణి పోర్టల్‌లో నమోదు కాని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదని చెప్తున్నారు.ఏజీపీఏ, వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి ఇంకా అందుబాటులోకి రాలేదంటున్నారు. పాత చలాన్ల సమస్య, ఎన్‌వోసీ, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ లాంటి సమస్యలు, సాక్షులను మార్చుకునే అవకాశం లేకపోవడం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

మంగళవారం 155 స్లాట్స్
వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు,వాటి పరిష్కార మార్గాల కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మంగళవారం(డిసెంబర్ 15) సమావేశమై రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమస్యలు,లోపాలపై చర్చించనుంది. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలకు కారణాలు,వాటి పరిష్కారాలపై చర్చించనుంది. నాలుగైదు రోజుల పాటే జరిగే ఈ సమావేశాల అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.మంగళవారానికి(డిసెంబర్ 15) రాష్ట్రంలోని 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 155 స్లాట్లు బుక్కయినట్లు సీఎస్ కార్యాలయం వెల్లడించింది. అన్నిచోట్ల ప్రశాంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.












Click it and Unblock the Notifications