వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎఫ్‌టీఎల్‌లోనే వెంచర్లకు అనుమతి: హైదరాబాద్ కాలనీలకు ముప్పు సమస్య?

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ చుట్టూ భారీగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. వాటిలో కబ్జాకు గురైన చెరువులు కూడా ఉన్నాయి. ఆయా చెర్వుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే సదరు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ చుట్టూ భారీగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. వాటిలో కబ్జాకు గురైన చెరువులు కూడా ఉన్నాయి. ఆయా చెర్వుల పూర్తి నిల్వ సామర్థ్య స్థలం (ఎఫ్‌టీఎల్) పరిధిలోనే సదరు టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేశారు.

ఇటీవలి మియాపూర్ భూభాగోతం వెలుగు చూసిన తర్వాత తాజాగా హైదరాబాద్ మహా నగర పాలక సంస్థతోపాటు హైద్రాబాద్ మెట్రోపాలిటన్ నగర అభివ్రుద్ది సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో కళ్లు మిరుమిట్లు గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. నాటి హుడా మొదలు నేటి హెచ్ఎండీఏ వరకూ టౌన్ ప్లానింగ్ అధికారులు 'ఎఫ్‌టీఎల్‌' ఎక్కడ ఉన్నదో గుర్తించకుండానే అనుమతులిచ్చేశారని తేలింది. తాము గతంలో అనుమతులిచ్చిన ఇళ్లన్నీ ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నట్లు గుర్తించడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నాడు అమ్యామ్యాలకు అలవాటు పడిన సాక్షాత్తూ అధికారులే హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రధాన చెరువుల ఉసురు తీశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలను తుంగలోకి తొక్కి చెరువు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌- పూర్తి నిల్వ సామర్థ్యం)లోనే గృహ నిర్మాణ వెంచర్లకు అనుమతులు ఇవ్వడంతో పలు చెరువులు అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అదేసమయంలో ఎఫ్‌టీఎల్‌లో వెలిసిన పలు కాలనీలకూ ముంపు సమస్య ముంచుకొస్తోంది. ఇటీవల మల్కాజిగిరి పరిధిలో బండ చెరువు కట్ట తెగిపోవడంతో హబ్సిగూడ, ఉప్పల్, నాచారం తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొన్నది. దీనికి కారణం ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో మూడువేలకు పైగా ఉన్న చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌ను గుర్తించకపోవడమే. ఇప్పుడు అధికారికంగా ఈ చెరువులకు ఎఫ్‌టీఎల్‌లు నిర్ధారిస్తుంటే అనేక కాలనీలు వీటి పరిధిలోకి రావడంతో ఏం చేయాలో తెలియక అర్థం గానీ అయోమయ పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు.

తెలంగాణ ఏర్పాటయ్యాకే చెరువుల ఎఫ్‌టీఎల్‌పై దృష్టి

తెలంగాణ ఏర్పాటయ్యాకే చెరువుల ఎఫ్‌టీఎల్‌పై దృష్టి

హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ ఆధీనంలో 3132 చెరువులు ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 186 ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో చెరువులకు పక్కాగా ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించలేదు. సాగునీరు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో నాటి హుడా తమ ఆధీనంలోని చెరువులకు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించాలి. 2013లో హైకోర్టు స్పందించి తక్షణం చెరువులన్నింటికీ ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఈ చెరువుల ఎఫ్‌టీఎల్‌పై దృష్టి సారించింది. నాటి హుడాతోపాటు ఇప్పటి హెచ్‌ఎండీఏ కూడా ఇష్టానుసారం ఎఫ్‌టీఎల్‌లోనే గృహ నిర్మాణ వెంచర్లకు అనుమతులిచ్చేయడంతో కాలనీలు ఏర్పడ్డాయి.

కాలనీల తొలగింపు అసాధ్యం.. కర్తవ్యమేమిటో మరి..

కాలనీల తొలగింపు అసాధ్యం.. కర్తవ్యమేమిటో మరి..

హెచ్‌ఎండీఏ పరిధిలోని 3132 చెరువులకు గత ఏడాదిలో 1336 చెరువులకు మాత్రమే ఎఫ్‌టీఎల్‌ను గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో దాదాపు 95 చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌లోనే పలు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో 186 చెరువులకు 172 చెరువులకు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కొన్ని చెరువుల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేశారని తేలింది. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. అప్పట్లో అధికారులు రెవెన్యూ, సాగునీటి శాఖ రికార్డులను దగ్గర పెట్టుకుని వెంచర్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వెలసిన కాలనీల్లోని ఇళ్లను తొలగించే పరిస్థితి లేదు. అధికారుల తప్పిదంతో చెరువులు కుంచించుకుపోయి.. వర్షం వస్తే వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు..

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు..


హైటెక్‌ సిటీ సమీపంలోని దుర్గం చెరువుకు ఇటీవలి వరకు పూర్తిస్థాయిలో ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించలేదు. 1986-88లో అప్పటి హుడా అధికారులు ఈ చెరువులోని నీటి నిల్వను బట్టి ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించి చెరువు చుట్టూ ఉన్న భూమిని నివాస ప్రాంతంగా గుర్తించారు. దీంతో దాదాపు 30 ఎకరాల పరిధిలో రెండు కాలనీలకు అనుమతి ఇచ్చేశారు. అక్కడ నిర్మాణాలు కూడా భారీగా జరిగిపోయాయి. 2002లో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతం మునిగిపోవడంతో సాగునీరు, ఇతర శాఖల అధికారులు కలిసి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించారు. దాదాపు 200 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చిందని తేల్చారు. ఆ పరిధిలోనే తాము అనుమతులిచ్చిన కాలనీలు ఉన్నాయని గుర్తించిన తర్వాత అక్కడి ఇళ్ల యజమానులకు నోటీసులిచ్చారు. వారు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. ఇప్పుడు మిగిలిన ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు.

కాప్రా చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్ ఆక్రమణ

కాప్రా చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్ ఆక్రమణ

మల్కాజిగిరికి దగ్గరలోని బండచెరువు 50 ఎకరాల్లో ఉండాల్సి ఉండగా ఇప్పుడు ఆక్రమణలు పోను 30 ఎకరాల్లో ఉంది. దీని చుట్టూ ఎఫ్‌టీఎల్‌ పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హుడా అధికారులు ఎఫ్‌టీఎల్‌లోనే ఒక వెంచర్‌కు అనుమతి ఇవ్వడంతో అనేక ఇళ్లు నిర్మించేశారు. రెండురోజుల కిందట ఈ చెరువు పొంగి మల్కాజిగిరి ప్రాంతంలోని పది కాలనీలు నీట మునిగాయి. మన్సూరాబాద్‌లోని పెద్ద చెరువు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ చెరువు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 28 ఎకరాల ఎఫ్‌టీఎల్‌ ప్రాంతం రికార్డుల్లో ఉంది. దీనికి కూడా కొన్నేళ్లుగా పూరిస్థాయి ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించక అధికారులు ఓ కాలనీకి కొన్నేళ్ల కిందటే అనుమతి ఇచ్చేశారు. ఇటీవల ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌ను అధికారికంగా నిర్ధారిస్తే ఈ కాలనీతోపాటు అనుమతి లేకుండా నిర్మించిన అనేక ఇళ్లు కూడా అందులోనే ఉన్నట్లు గుర్తించారు. కాప్రా చెరువుదీ ఇదే పరిస్థితి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 132 ఎకరాల్లో కాప్రా చెరువు ఉంది. దీని చుట్టూ దాదాపు 40 ఎకరాల వరకు ఎఫ్‌టీఎల్‌ ఉంది. ఇక్కడ కూడా అతి పెద్ద వెంచర్‌కు కొన్నేళ్ల కిందటే అనుమతి ఇచ్చేశారు. ఇక్కడ చెరువు కూడా ఆక్రమణకు గురి కావడంతోపాటు ఇందులోనూ ఇళ్ల నిర్మాణం జరిగిపోయింది. తాజా సర్వేలో ఇవన్నీ ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నట్లు తేల్చారు. హెచ్‌ఎండీఏ ఏర్పడిన తర్వాత కూడా చెరువుల దగ్గర కొన్ని కాలనీలకు అనుమతి ఇచ్చేశారు.

పాత అనుమతులపై తుది నిర్ణయం సర్కార్ దేనన్న హెచ్ఎండీఏ

పాత అనుమతులపై తుది నిర్ణయం సర్కార్ దేనన్న హెచ్ఎండీఏ

చెరువుల ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి ఎటువంటి రికార్డులు తమ వద్ద లేవని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. అవన్నీ సాగునీటి శాఖ దగ్గరే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పరిధిలో 3132 చెరువులకు 2300 చెరువులకు సర్వే పూర్తిగా చేసి 1336 చెరువులకు ఎఫ్‌టీఎల్‌ను గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చామని చిరంజీవులు తెలిపారు. 136 చెరువులకు తుది నోటిఫికేషన్‌ ఇచ్చామని వివరించారు. హుడా హయాంలో దుర్గం చెరువు తదితర చోట్ల ఎఫ్‌టీఎల్‌లో వెంచర్లకు అనుమతి ఇచ్చినట్లు తాజా సర్వేలో తేలుతున్నదని ఇటువంటి వెంచర్లపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. తాజాగా చెరువుల పరిధిలో ఎఫ్‌టీఎల్‌ను గుర్తించిన తర్వాతే పక్కనున్న భూముల్లో వెంచర్లకు అనుమతి ఇస్తున్నామని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు.

English summary
HMDA and GHMC officials neglegency leads to threat colonies people in Hyderabad. Revenue and GHMC, past HUDA, present HMDA officials improper. Particularly Hyderabad city outskurts so many lakes here in past. Today Realters, politicians and other celebritise encroached the Lakes FTL Land and layout for plots. Hyderabad people took that plates and constructed homes and no faces water logging problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X