డబ్బుల కోసం వృద్ధురాలి హత్య: నిందితులు వీరే
హైదరాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్దురాలిని దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు అభరణాలను దోచుకెళ్లిన ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అంబర్‌పేట సీపీఎల్‌రోడ్డులోని ఈస్ట్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ డాక్టర్ రవీందర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, ఏసీపీ సుధాకర్, ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అంబర్‌పేట మున్సిపల్ కాలనీకి చెందిన మూల కిష్టయ్య, సుగుణ(60) దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హెడ్‌మాస్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన భర్త కిష్టయ్య మృతి చెందడంతో సుగుణ తన కూతురు రాధికతో పాటు మున్సిపల్ కాలనీలో ఉంటోంది. మరో కూతురు ఆస్ట్రేలియాలో ఉంది.
రాధిక హైటెక్ సిటీలోని ప్రైవేట్ సంస్థలో హెచ్‌ఆర్‌గా పని చేస్తోంది. ఈ నెల 15న మంగళవారం ఉదయం 9.30 ప్రాంతంలో రాధిక విధులకు హాజరుకావడానికి హైటెక్ సిటీకి వెళ్తుండగా, సుగుణ తాను పింఛన్ తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్ళివస్తానని కూతురుకు చెప్పింది.

సుగుణ తనకు తెలిసిన గోల్నాక శాంతినగర్‌కు చెందిన షేక్ షరీఫ్(25) ఆటోలో పింఛన్ తీసుకోవడానికి వనస్ధలిపురంలోని బ్యాంక్ వెళ్లింది. తిరిగి సుగుణ మధ్యాహ్నం తిరిగి వచ్చింది. సుగుణను ఇంటి వద్ద దించిన ఆటో డ్రైవర్ షరీఫ్ ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెను హత్య చేసి బంగారు అభరణాలను దోచుకోవాలని పథకం పన్నాడు.
తన స్నేహితులైన అలీకేఫ్ అజాద్‌నగర్‌కు చెందిన ఎలాక్ట్రిషియన్ పతి మధు(33), అంబర్‌పేట మహాలక్ష్మి వైన్స్‌లో పనిచేసే గోధులోల శ్రీరాములు(45)లను పిలిపించుకున్నాడు. ముగ్గురు కలిసి సుగుణ ఇంటి వద్దకు వెళ్ళాడు. షరీఫ్ ఇంటి ముందు కాపలాగా నిలబడగా, మధు, శ్రీరాములు తాము డ్రైనేజీ పని చేస్తామంటూ సుగుణ ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు మూసి సుగుణపై దాడి చేసి దిండు, దస్తీలతో ఆమె ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు.

ఏడు తులాల బంగారు ఆభరణాలను, 20వేల నగదును, మూడు సెల్‌ఫోన్లను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన అంబర్‌పేట పోలీసులు, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సుగుణను తన ఆటోలో బయటకు తీసుకుని వెళ్ళే ఆటో డ్రైవర్ షేక్ షరీఫ్‌పై అనుమానం కలిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
షరీఫ్ ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం గోల్నాకలో నిందితులు మధు, శ్రీరాములులను అరెస్టు చేసి,వారి వద్ద నుంచి 7 తులాల బంగారు అభరణాలను, 20వేల నగదును, మూడు సెల్‌ఫోన్లను, ఒక ఆటో,మరో హోండా వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications