Huzurabad : అప్పట్లో బాల్క సుమన్... ఇప్పుడు గెల్లు శ్రీనివాస్... ప్రత్యర్థిపై ఆ అస్త్రం వర్కౌట్ అవుతుందా...?

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో... గ్రౌండ్‌లో ఎవరి బలమెంత అనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల లాంటి బలమైన నేతను... మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ ఎంతమేర ఎదుర్కోగలరనే విశ్లేషణలు జరుగుతున్నాయి. సహజంగానే టీఆర్ఎస్,బీజేపీ తమ ప్రత్యర్థి కన్నా తామే బలంగా ఉన్నామని భావిస్తున్నాయి. ఓవైపు పథకాలు,హామీలతో హుజురాబాద్ ప్రజలను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే... ఈటల మాత్రం సెంటిమెంటునే నమ్ముకున్నారు. ఇన్నాళ్లు తనను నడిపించిన జనం ఇప్పుడూ తన వెంటే ఉంటారని చెబుతున్నారు. అయితే ఈటల సెంటిమెంటును ఢీకొట్టేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ బలమైన నినాదమెత్తుకున్నారు.

హుజురాబాద్‌లో గెల్లు నినాదం ఇదే...

హుజురాబాద్‌లో గెల్లు నినాదం ఇదే...

రెండు గుంటల భూమి ఉన్న నిరుపేద అభ్యర్థి ఒకవైపు... రెండు వందల ఎకరాలున్న ఆసామి మరొకవైపు... ఇది హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రస్తుత నినాదం. రెండు గుంటల గెల్లుకు,రెండు వందల ఎకరాల ఈటలకు మధ్య పోటీ అని చెప్పడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందవచ్చునని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదన ఆర్జించిన వ్యక్తికి,తొలి నుంచి నిస్వార్థంగా అటు ఉద్యమంలో,ఇటు పార్టీలో పనిచేస్తున్న వ్యక్తికి మధ్య పోటీ అని టీఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈటల కూడా సానుభూతినే నమ్ముకున్నారు. గులాబీ జెండా మోసిన తనను కేసీఆర్ గెంటేశారని... తెలంగాణ వ్యతిరేక శక్తులను దగ్గర చేర్చుకుని... నమ్మిన బంటులా పనిచేసిన తనను బయటకు పంపించారని మొదటి నుంచి చెబుతున్నారు. కేసీఆర్‌ తనపై ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ ప్రజలు తనను కడుపులో పెట్టుకుంటారనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.

గతంలో బాల్క సుమన్‌ ఎత్తిన నినాదం...

గతంలో బాల్క సుమన్‌ ఎత్తిన నినాదం...

హుజురాబాద్ ఉపఎన్నికలో గెల్లు శ్రీనివాస్ కోసం టీఆర్ఎస్ ఇస్తున్న నినాదం కొత్తదేమీ కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన బాల్క సుమన్ ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. 'వంద కేసులు ఓవైపు... వంద కోట్లు మరోవైపు..' అంటూ అప్పట్లో తన ప్రత్యర్థి,మాజీ ఎంపీ వివేక్‌పై ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఒంటిపై లాఠీ దెబ్బలు,చెమట వాసన ఓవైపు... అత్తరు వాసన,ధనబలం మరోవైపు అంటూ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటం... ఉద్యమకారుడిగా బాల్క సుమన్‌కు మంచి గుర్తింపు ఉండటంతో ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. సంపన్నుడైన వివేక్‌ను ఓడగొట్టి యువకుడు,మధ్యతరగతి నుంచి వచ్చిన బాల్క సుమన్‌ను అసెంబ్లీకి పంపించారు. ఇప్పుడిదే నినాదంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

గెల్లుకు వర్కౌట్ అవుతుందా...

గెల్లుకు వర్కౌట్ అవుతుందా...

తాజాగా హుజురాబాద్‌లో ప్రచారం సందర్భంగా బాల్క సుమన్ తన పాత నినాదాన్ని వినిపించారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం.. మట్టి వాసనకు,అత్తరు వాసనకు,కోట్లకు పడగలెత్తిన సంపన్నుడికి,కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి మధ్య పోరాటంగా హుజురాబాద్ ఉపఎన్నికను అభివర్ణించారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లోకి ఈ నినాదం బలంగా వెళ్తే... గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై కచ్చితంగా సానుభూతి వర్కౌట్ అవుతుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు గెల్లు శ్రీనివాస్ కూడా తన మొదటి ప్రసంగంలోనే... ముత్తాత ఇచ్చిన రెండు గుంటలు తప్ప తనకెలాంటి ఆస్తిపాస్తులు లేవని,నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని అన్నారు.

ఎంతో తర్జనభర్జన తర్వాత అభ్యర్థి ప్రకటన...

ఎంతో తర్జనభర్జన తర్వాత అభ్యర్థి ప్రకటన...

ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో ఎంతో తర్జనభర్జన పడిన ఆ పార్టీ... చివరకు గెల్లు శ్రీనివాస్‌ వైపే మొగ్గుచూపింది. ఉద్యమకారుడు,స్థానికుడు,బీసీ నేత కావడంతో గెల్లు శ్రీనివాస్ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. బీసీ వర్గానికి చెందిన ఈటలను అదే వర్గానికి చెందిన నేత అయితేనే ఎదుర్కోగలడని భావించారు. అంతకుముందు,పాడి కౌశిక్ రెడ్డి,ముద్దసాని కశ్యప్ రెడ్డి,ముద్దసాని మాలతి,స్వర్గం రవి,వకుళాభరణం కృష్ణమోహన్ తదితరుల పేర్లను కేసీఆర్ పరిశీలించినప్పటికీ చివరికి గెల్లుకే అవకాశం ఇచ్చారు.

నియోజకవర్గంపై గులాబీ బాస్ ఫుల్ ఫోకస్...

నియోజకవర్గంపై గులాబీ బాస్ ఫుల్ ఫోకస్...

ఎలాగైనా సరే హుజురాబాద్‌లో గెలవాలనే లక్ష్యంతో నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు కేసీఆర్. నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలను టీఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెడ్డి సామాజికవర్గానికి చెందిన పాడి కౌశిక్‌ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా బరిలో దింపారు. ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. దానికి తోడు దళిత బంధు పథకం,కొత్త రేషన్ కార్డులు,ఫించన్లు,అభివృద్ది పనులు... పలు హామీలు... వీటన్నంటి ప్రభావం టీఆర్ఎస్ గెలుపుకు దోహదం చేస్తుందని గులాబీ బాస్ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌లో గెలుపు బాధ్యతలను ఆయన ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించారు. బుధవారం(ఆగస్టు 12) నియోజకవర్గంలోకి గ్రాండ్‌గా ఇచ్చిన హరీశ్ రావు... వ్యూహ,ప్రతివ్యూహాలతో గెల్లును విజయ తీరాలకు చేర్చే పనిలో నిమగ్నమయ్యారు.

ట్రబుల్ షూటర్ తిప్పేస్తారా...?

ట్రబుల్ షూటర్ తిప్పేస్తారా...?

కేసీఆర్ హరీశ్ రావును రంగంలోకి దింపడంతో ఈటల వర్సెస్ హరీశ్‌గా హుజురాబాద్ రాజకీయం కనిపిస్తోంది. ఒకనాటి సన్నిహితులైన ఇద్దరి మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... టీఆర్ఎస్‌లో చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. 2001లో హరీశ్‌కు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై విచారణకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్‌లో బహిరంగ చర్చకు రావాలన్నారు. దీనిపై హరీశ్ రావు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద హుజురాబాద్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై పెద్ద ప్రభావమే చూపవచ్చుననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ దీన్ని అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+