OPINION: హైడ్రాతో రేవంత్ పులి స్వారీ ? జన హితమా ? కాంగ్రెస్ కు ఆత్మహత్యా సదృశ్యమా ?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల్ని, ఇతర జనవనరుల్ని కాపాడేందుకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తోంది. హైడ్రా ఏర్పాటు ఉద్దేశం చాలా మందికి తెలియక ముందే హైదరాబాద్ పరిధిలో చాలా నిర్మాణాలు నేలకొరిగాయి. వీటిలో దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్నవి చాలానే ఉన్నాయి. అలాగే పేదల ఇళ్లూ ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్దితి. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతల ప్రభావం ఎలా ఉండబోతోందన్నది ఓసారి చూద్దాం..

హైడ్రా ఆలోచన

మహానగరమైన హైదరాబాద్ చిన్న వర్షం పడితే చాలు మునిగిపోయే పరిస్దితుల్లో ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా ఏమార్పూ లేకుండా దశాబ్దాలుగా ఇదే తీరు. దీన్ని మార్చాలంటే గట్టి నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్దితి. ఇందులో నుంచి తెరపైకి వచ్చిందే హైడ్రా. రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా నేతలు పట్టించుకోకుండా వదిలేసి, లేకపోతే ప్రోత్సహించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఇప్పుడు విరుచుకుపడుతోంది. దీంతో వీరంతా హైకోర్టుకు క్యూ కట్టారు.

OPINION HYDRA CONGRESS S POLITICAL SUICIDE OR PRIORITISING GREATER GOOD

బాధితుల గగ్గోలు

హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైడ్రా ప్రారంభంలో అడ్డు చెప్పలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ బాధితులు లేవనెత్తుతున్న విధానపరమైన లోపాలు హైకోర్టును సైతం ఆలోచనలో పడేశాయి. ముఖ్యంగా అన్ని అనుమతులు తీసుకుని ఎప్పుడో కట్టుకున్న ఇళ్లను, అప్పటి నుంచీ అన్ని పన్నులు చెల్లిస్తున్న తమ ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ బాధితులు అడుగుతున్న ప్రశ్నలకు హైకోర్టు వద్ద కూడా సమాధానం లేదు. దీంతో సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు మొదలయ్యాయి.

హైకోర్టు వర్సెస్ హైడ్రా

హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టినప్పుడు సమర్ధించిన హైకోర్టు.. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘించి సెలవు దినాల్లో సైతం చేపడుతున్న కూల్చివేతల్ని, స్టే ఉన్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్న విధానాల్ని మాత్రం తీవ్రంగా తప్పుబట్టింది. అమీన్ పూర్ ప్రాంతంలో సెలవు రోజుల్లో చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా పూర్తిగా ఇరుకునపడింది. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్నాక పని దినాల్లో జరగాల్సిన కూల్చివేతలపై హైడ్రా దూకుడును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై హైడ్రా కమిషనర్ తో పాటు అమీన్ పూర్ ఎమ్మార్వోను సైతం హైకోర్టు మందలించింది.

జన హితం ఉన్నా

హైడ్రా కూల్చివేతలు మొదలైనప్పుడు నగరంలో చెరువుల్ని పునరుద్ధరిస్తున్నారని జనం మెచ్చుకున్నారు. క్రమంగా వారి ఆర్తనాదాలు, వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు సోషల్ మీడియాను కమ్మేశాయి. దీంతో అన్ని వర్గాలు బాధితులపై సానుభూతి చూపడం మొదలుపెట్టేశాయి. ఇవన్నీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం మిగిల్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక ఉచిత హామీల్ని అమలు చేయడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ కు ఇప్పుడు వాటిని మించి హైడ్రా కూల్చివేతల వ్యవహారం ఇబ్బందికరంగా మారుతోంది. జనం వీటిని అంత త్వరగా మర్చిపోకపోవచ్చు.

కాంగ్రెస్ కు ఆత్మహత్యా సదృశ్యం

హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న ప్రాంతాలన్నీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన సీట్ల పరిధిలోకే వస్తున్నాయి. కాంగ్రెస్ కు ఆయా ప్రాంతాల్లో పట్టులేదు. దీంతో హైడ్రా కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను టార్గెట్ చేసిందేనా అన్న చర్చ జరుగుతోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాబోయే రోజుల్లో దీని ప్రాధాన్యం జనం గుర్తిస్తారని చెబుతున్నారు.
జలవనరుల్ని అక్రమించుకున్న వారి వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడిందన్నది వాస్తవమే అయినా దీన్ని సరిచేయడానికి ఇదొక్కటే మార్గమా అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అయినా రేవంత్ దూకుడుగానే ముందుకెళ్తున్నారు. దీంతో దీర్ఘకాలంలో రేవంత్ ఆశిస్తున్న ప్రయోజనంపై చర్చ జరుగుతోంది. ఆ వ్యూహం ఫలించకపోతే మాత్రం కాంగ్రెస్ పతనం తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+