ఓయు భూములు ఎవడబ్బ సొత్తు కాదు: నాయిని
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర మంత్రులు శవయాత్రలు నిర్వహించడం, దగ్ధం చేయడంపై హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెరాస ప్రభుత్వం హయాంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు భద్రంగా ఉంటాయని చెప్పారు. తాము తీసుకునే ఓయూ భూములు ప్రజల సొత్తు అన్నారు. ఆ భూములు ఎవడబ్బ సొత్తుకాదని వ్యాఖ్యానించారు.
ఓయూ భూములను ఎవరూ తీసుకోలేరన్నారు. తెలంగాణ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ వెబ్‌సైట్‌ను శనివారం సచివాలయంలో నాయిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఓయూ భూములు తీసుకుంటామని సీఎం అన్నందుకు ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయటం సరికాదన్నారు.

తెరాస వ్యతిరేక శక్తులే ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తాను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఓయూ భూముల పరిరక్షణ కోసం ఉద్యమించానని, అసెంబ్లీ వరకు విద్యార్థులతో కలిసి పాదయాత్ర చేశానని గుర్తు చేశారు.
ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ ఉచ్చులో పడొద్దని ఓయూ విద్యార్థులకు సూచించారు. ఓయూ పాలకమండలి ఈ భూములపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఓయూ భూములను కబ్జాచేసి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై విద్యార్థులు ఎందుకు ఉద్యమించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications