అది పానీ పూరీ బండే.. కానీ, గంజాయీ లభిస్తుంది!: వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: అది పేరుకే పానీ పూరీ బండి.. అక్కడ జరిగేది మాత్రం మరోటి. పానీపూరీ బండి మాటున గంజాయి అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.అతని వద్ద నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నగరంలోని అబిడ్స్‌కు చెందిన ముస్తాపూర్ ప్రశాంత్.. తాజ్‌మహల్ హోటల్ క్రాస్ రోడ్, భారతీ విద్యా భవన్ రోడ్ ప్రాంతాల్లో పానీపూరీ బండ్లను నడుపుతున్నాడు. వీటితో వచ్చే ఆదాయం సరిపోవట్లేదని భావించాడు. ఈ క్రమంలో ఈ బండ్లపైనే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

ఇక అనుకున్నదే తడవుగా ధూల్‌పేటకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి నుంచి రూ. 25 వేల విలువ చేసే గంజాయి కొనుగోలు చేశాడు. దీన్ని రూ. 45 వేలకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇక అలాగే రామకృష్ణ థియేటర్ గేట్ దగ్గర పానీపూరీ బండిపైనే గంజాయి అమ్మేందుకు యత్నించాడు.
అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 2.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గంజాయి అమ్మి అక్రమ మార్గం ద్వారా డబ్బు సంపాదించాలనుకున్న నిందితుడు.. చివరకు కటకటాలపాలయ్యాడు.
'నిందితుడు ధూల్‌పేటలోని జాలి హనుమాన్‌లో నివసించే యశ్వంత్ అలియాస్ గౌతమ్ (25) అనే వ్యక్తి నుంచి గంజాయిని రూ. 25,000 కొని.. కిలో రూ.45,000 విక్రయించాలని నిర్ణయించాడు. పథకం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున రామకృష్ణ థియేటర్ గేట్ దగ్గరకు వచ్చి వినియోగదారులకు గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నిందితుడు పట్టుబడ్డాడు'అని డీసీపీ టాస్క్ ఫోర్స్ పి రాధా కిషన్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications