పక్కింట్లోనే 5 రోజులు నరకం చూసిన బిడ్డ ! ఆచూకీ కోసం తల్లడిల్లిన పేరెంట్స్ ! చివరికి ఏమైంది ?
మక్తల్ : కన్నబిడ్డ కనిపించకుండా పోతే పేగుబంధం ఎంతలా తల్లడిల్లుతుందో అది అనుభవించేవారికే తెలుసు. ఐదు రోజుల పాటు తమ బిడ్డ కనిపించకుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎక్కడికి పోయిందో తెలియదు.. ఎవరైనా తీసుకెళ్లారో తెలియదు.. అసలు ఏమైందో తెలియదు. చివరకు బిడ్డ ఆచూకీ కోసం కనిపించిన ప్రతి గడప తొక్కారు. తెలిసినవాళ్లింట్లో, చుట్టాల ఇంట్లో ఎక్కడా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఐదు రోజుల తర్వాత పక్కింట్లో ప్రత్యక్షమైంది.

కన్నబిడ్డ జాడలేక..!
నారాయణపేట జిల్లా మక్తల్ యాదవ్ నగర్ కు చెందిన సురేశ్, మహదేవమ్మ దంపతుల కూతురు అఖిల ఐదు రోజుల కిందట కనిపించకుండా పోయింది. బిడ్డ జాడ లేదని ఊరంతా వెతికారు. ఇరుగు పొరుగు గ్రామాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లి అడిగారు. అయితే సంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికిన చందంగా.. ఆ చిన్నారి పక్కింట్లో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఐదు రోజుల పాటు తిండి లేకుండా నీరసించిపోయిన కన్నబిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

ఇంటిపైన ఆడుకుంటుంటే..!
ఐదు రోజుల కిందట అఖిల ఇంటిపైన ఆడుకుంటున్న సమయంలో కాలుజారి పక్కింటి రేకులపై పడిపోయింది. అవి ప్లాస్టిక్ రేకులు కావడంతో కూలిపోయి ఆ ఇంట్లోకి జారిపడింది. అయితే పక్కింటోళ్లు తాళం వేసి వేరే ఊరికి వెళ్లడంతో చిన్నారి ఆ ఇంట్లో పడిపోయిన విషయం ఎవరికీ తెలియదు. ఆ బాలిక లోపల నుంచి ఎంత అరిచినా ఎవరికీ వినిపించలేదు. అదలావుంటే తమ బిడ్డ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

5 రోజులు మంచినీళ్లే..!
అలా ఆ ఐదు రోజుల పాటు కేవలం మంచినీళ్లు తాగుతూ గడిపేసింది. చివరకు పక్కింటోళ్లు ఊరు నుంచి తిరిగిరావడంతో బాలిక అదృశ్యం కథ సుఖాంతమైంది. పక్కింటోళ్లు తొందరగా తిరిగిరావడంతో సరిపోయింది.. ఒకవేళ ఆలస్యంగా వస్తే చిన్నారి పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొత్తానికి బిడ్డ క్షేమంగా ఉండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే ఐదు రోజులు తిండి లేక బక్కచిక్కిపోయిన ఆ చిన్నారిని చూసి కంటనీరు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications