శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన: పాత రోజులు!
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా మనదేశంలోనూ పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. దీంతో గంటలకొద్ది వేచివున్న దేశీయ ప్రయాణికులు ఆందోళనలకు దిగారు.
హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుమారు 10 గంటలుగా ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, గోవా, విశాఖపట్నం, లక్నో, కోల్‌కతా, ముంబై, కొచ్చి వెళ్లాల్సిన విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో సుమారు 10 గంటలుగా విమానాశ్రయంలోనే వందలాది మంది ప్రయాణికులు వేచివున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై.. ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తమను తమ గమ్య స్థానాలకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 30కి పైగా విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయంలో ప్రయాణికులతో రద్దీగా మారింది.
Handwritten boarding passes being handed out at Hyderabad airport for the last 5 hours now #GlobalOutage #flights pic.twitter.com/RXJGIp3wjZ
— Rishika Baruah (@rishika625) July 19, 2024
కాగా, విండోస్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యకు కారణం తెలిసింది. ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు ఆ సర్వీసు అప్‌డేటే కారణమని క్రౌడ్ స్ట్రయిక్ తెలిపింది.
Live from Hyderabad airport where everything is running manually..
— D.Shivsagar (@SarkarSupremacy) July 19, 2024
Flight cancellations on board.
Old school.
My sister is stuck in airport 😭 pic.twitter.com/oLFC6aV5ep
ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజినీర్లు పనిచేస్తున్నారని, అప్‍డేట్‍ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. సమస్య పరిష్కారానికి డీబగ్ రూపొందించినట్లు పేర్కొంది. దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ, భద్రతాపరమైన లోపం గానీ లేదని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు. కాగా, విండోస్‌లో తలెత్తిన సమస్యతో ప్రభుత్వ సేవలతో పాటు, బ్యాంకులు, ఆరోగ్య, అత్యవసర, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ, రైల్వే, విమానాశ్రయ తదితర సేవలకు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications