పవన్ కల్యాణ్ టీ ఆపరేషన్: కాంగ్రెసుకు గుబులు, కెసీఆర్ వ్యూహం?
Recommended Video

హైదరాబాద్: కొండగట్టు నుంచి తన యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఆపరేషన్‌కు పూనుకున్నట్లు చెబుతున్నారు. ఆయన తన పర్యటనలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అంటున్నారు.
తెలంగాణలో జనసేనను పోటీకి దించే ఉద్దేశంతో పవన్ కల్యాణ్‌కు ఉన్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ తెలంగాణ ఆపరేషన్‌పై కాంగ్రెసు నేతల్లో గుబులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ అనుకూలమేనా..
జనసేన అధినేత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, తన అభ్యర్థులను పోటీకి దించడం ద్వారా పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రయోజనం చేకూరుస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలను ఒకతాటి మీదికి తెచ్చి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవాలనే కాంగ్రెసు వ్యూహానికి ఇది విఘాతం అవుతుందని భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై అనుమానం అందుకే...
పవన్ కల్యాణ్ అనూహ్యంగా ఇటీవల కేసీఆర్‌ను కలిశారు. భేటీ ఆంతర్యం ఏమిటనేది పూర్తిగా తెలియకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. దానికితోడు, కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు పథకానికి ఆయన ఫిదా అయ్యారు. అందువల్లనే పవన్ కల్యాణ్ కెసీఆర్‌కు అనుకూలంగానే రంగంలోకి దిగుతున్నారనే అనుమానాలను కాంగ్రెసు వ్యక్తం చేస్తోంది.

ఏ మాత్రం ఓట్లు చీల్చినా నష్టమే...
పవన్ కల్యాణ్ తెలంగాణలో అధికారంలోకి వస్తారనే నమ్మకం ఎవరికీ లేదు. కానీ, జనసేనకు ఏదో మేరకు ఓటు బ్యాంకు ఉంటుందనేది మాత్రం కాదనలేని విషయం. తెలంగాణలో పవన్ కల్యాణ్ర్‌కు అభిమానులు ఉన్నారు. తెరాసతో పవన్ కల్యాణ్ కలిసి పనిచేయకున్నా, ఒంటరిగా పోటీ చేసినా కాంగ్రెసుకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు ఏదో మేరకు చీలిపోతుంది.

అది కేసీఆర్ వ్యూహమేనా...
పవన్ కల్యాణ్ జనసేన తెలంగాణలో బరిలోకి దిగితే తమకు కెలిసి వస్తుందని కేసీఆర్ గట్టిగానే నమ్ముతున్నట్లు చెప్పవచ్చు. గతంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోషించిన పాత్రను జనసేన పోషిస్తుందని తెరాస వర్గాలంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే కేసీఆర్ వ్యూహం ఉంటుందని అంటున్నారు.

పవన్ కల్యాణ్ తన బలాన్ని...
తెలంగాణలోని తన బలాన్ని పవన్ కల్యాణ్ కూడగట్టుకోవడంలో బాగంగానే పవన్ కల్యాణ్ తన పర్యటనను తలపెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో జగన్ కూడా నిరాహారదీక్ష చేపట్టడం ద్వారా అదే పనిచేశారు. జగన్ ఆందోళన అప్పుడు కేసీఆర్‌కు ఉపయోగపడిందని అంటారు.

పవన్ కల్యాణ్ అభిమానులతో సమావేశాలు...
తన పర్యటన ప్రారంభించడానికి ముందు పవన్ కల్యాణ్ తన అబిమానులతో సమావేశాలు నిర్వహించారు. జనసేనను స్థాపించిన తర్వాత తెలంగాణలో ఆయన తొలి పర్యటన ఇదే. రెండు నెలల క్రితం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన అభిమానులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారి వ్యక్తిగత వివరాలు కూడా సేకరించారు. పార్టీకి ఎంత సమయం కేటాయిస్తారనే విషయాలను కూడా రాబట్టారు.

కిందిస్థాయి నుంచి పవన్ కల్యాణ్
కింది స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను కులుపుకుని వెళ్లేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని సూచించారు. రాజకీయ విమర్శలు చేయకూడదని కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు స్థాయి ఇంచార్జీలను ఎంపిక చేస్తారని, వారికి హైదరాబాదులో శిక్షణ ఇప్పిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications