మోడీకే ఆ అర్హత: సమతామూర్తిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్, చినజీయర్ స్వామికి పాదాభివందనం
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ రామనుజాచార్య విగ్రహం చుట్టూ ఉన్న 108 దివ్య దేవాలయాలను దర్శించున్నారు.

చినజీయర్ స్వామి మహా సంకల్పం వల్లే..: పవన్ కళ్యాణ్
అనంతరం ప్రవచన మండపంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. చినజీయర్ స్వామికి పాదాభివందనలు చేశారు. చినజీయర్ స్వామి మహా సంకల్పం వల్లే ఇదంతా సాధ్యమైందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
సమతామూర్తి విగ్రహంతో సరికొత్త గుర్తింపు: పవన్ కళ్యాణ్
సమతామూర్తి రామానుజల వారి 216 అడుగుల విగ్రహం వద్దకు రావడం సంతోషంగా ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. ఇంత ఎత్తులో సమతామూర్తి విగ్రహం స్థాపించడం చినజీయర్ స్వామి మహాసంకల్పం వల్లే సాధ్యమైందన్నారు. 108 దివ్య ఆలయాలు ఒకే చోట ఉండటం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ దివ్యక్షేత్రం భాగ్యనగరానికి సరికొత్త గుర్తుగా మారిందన్నారు. ఆధ్యాత్మికక్షేత్రం అందరినీ ఆకట్టుకుంటోందన్నారు పవన్ కళ్యాణ్.
నరేంద్ర మోడీకే ఆ అర్హత ఉంది: పవన్ కళ్యాణ్
హైదరాబాద్ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన రామానుజ విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయడం శుభపరిణామం అన్నారు. రాజకీయాలు పక్కన పెడితే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత నరేంద్ర మోడీకే ఉందన్నారు. కాగా, ముచ్చింతల్‌లో పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రముఖుల రాక
హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. శ్రీరామానుజాచార్య 216 అడుగుల సమానత్వం విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 45 ఎకరాల సువిశాల స్థలంలో చిన్నజీయర్ స్వామి నిర్మించిన ఆలయంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు. ఫిబ్రవరి 7న ఏపీ సీఎం జగన్ వేడుకల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఫిబ్రవరి 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తారు. ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముచ్చింతల్ రానున్నారు. ఫిబ్రవరి 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications