పెద్దగట్టు జాతర.. ఆ రెండు జిల్లాల్లో పాఠశాలలకు రేపు సెలవు
పెద్దగట్టు జాతర సందర్భంగా నల్గొండ, సూర్యపేట జిల్లాల్లోని పాఠశాలలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం (ఫిబ్రవరి 17) సెలవు ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి సెలవు ప్రకటించారు. మరోవైపు, దురాజుపల్లి పెద్దగట్టు జాతర సరళిని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం పరిశీలించారు. పోలీస్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై ఆరా తీశారు.
గుట్టు చుట్టూ భద్రతా చర్యలను తనిఖీ చేసి, పోలీసు బందోబస్తు పరిశీలించారు. ఎగ్జిబిషన్ రోడ్డు, కోనేరు, వీఐపీ మార్గం, హైవేపై వాహనాల శ్రేణి, తూర్పు మెట్ల వద్ద బందోబస్తు, భద్రతా చర్యలను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి తొక్కిసలాటకు తావులేకుండా స్వామిని భక్తులు దర్శించుకునేలా చూడాలని పోలీసులకు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రోజులపాటు జరగనున్న జాతర కోసం 2వేల మంది పోలీసు సిబ్బంది, 500 మంది వాలంటీర్లు విధుల్లో ఉంటారు. 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.
సూర్యపేట జిల్లాలోనూ పాఠశాలలకు సెలవు
పెద్దగట్టు శ్రీ లింగమంతుల జాతర సందర్బంగా సూర్యపేట జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మేడారం తర్వాత.. పెద్దగట్టు జాతరే
మేడారం తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతుల జాతరకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఐదురోజులపాటు ఈ జాతర సాగనుంది. పెద్దగట్టు జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచేగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ ఏడాది జాతరకు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications