పోలీసులా? రాక్షసులా? మండిపడిన కలెక్టర్... వణుకుతున్న ఎస్సైలు
దళిత దంపతులపై ధర్మారం ఎస్సై హరిబాబు సాగించిన దౌర్జన్యకాండపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
పెద్దపల్లి: రాత్రి వేళ పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయబావి వద్దకు వెళ్లిన దళిత దంపతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పోలీస్ స్టేసన్ కు తరలించి, చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జన్యకాండపై పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితురాలు అరికెల్ల శ్యామల నిన్న కలెక్టర్ ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ మహిళ హక్కులకు, పిల్లల హక్కులకు భంగం కలిగిందనే నిర్ధారణకు వచ్చారు.
తక్షణమే విచారణ...
దీనిపై కలెక్టర్ వర్షిణి సోమవారం రాత్రే రామగుండం పోలీసు కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ కు లేఖ రాశారు. పోలీసుల దౌర్జన్యకాండపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

బాధితురాలు శ్యామల.. జిల్లా కలెక్టర్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు. అర్థరాత్రి వేళ పోలీసు జీపులో తనను, తన భర్త, పిల్లలను పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆమె వివరిస్తుండగా.. ఆ సమయంలో మహిళా పోలీసులు ఉన్నారా? అని కలెక్టర్ అడిగారు. శ్యామల 'లేరు..' అని చెప్పడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
మహిళా పోలీసులెక్కడ?
కలెక్టర్ పోలీసు కమిషనర్ కు రాసిన లేఖలోనూ.. పోలీసులు భార్యభర్తలతోపాటు పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారని, మహిళా పోలీసులు లేకుండా ఒక మహిళను రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఎలా ఉంచారు? అని ప్రశ్నించారు.
పై అధికారులకు లేఖలు...
మహిళా హక్కులకు భంగం కలగడంతోపాటు ఇది పిల్లలను మానసికంగా వేధించడమే అని భావించిన కలెక్టర్ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, పిల్లల సంక్షేమ బోర్డు, కరీంనగర్ జిల్లా పిల్లల సంక్షేమ కమిషన్ లకు లేఖలు కూడా రాశారు.
అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు కూడా లేఖలు పంపారు. కలెక్టర్ వర్షిణి రాసిన లేఖలు ఇటు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, అటు పోలీసు శాఖలో గుబులు రేకెత్తిస్తున్నాయి.
గతంలోనూ ఇంతే...
రామగుండం సీపీకి రాసిన లేఖలో.. పెద్దపల్లి ఎస్సైపై గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. గోదావరిఖనికి చెందిన బి.గణేశ్ పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. ఎస్సై అదుపులోకి తీసుకుని రాత్రంతా స్టేషన్ లో ఉంచి, మర్నాడు వదిలేశారని తెలిపారు.
ఈ ఘటనపై గణేశ్ తనకు ఫిర్యాదు చేయగా.. గత నెల 14వ తేదీన బాధితుడిని డీసీపీ వద్దకు పంపానని, దీనిపై ఏం చర్య తీసుకున్నారో, అసలు ఏం జరిగిందో ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విచారణ అధికారి మార్పు...
ఈ కేసులో విచారణ అధికారిగా నియమించిన పెద్దపల్లి ఏసీపీ సింధుశర్మ శిక్షణ నిమిత్తం హైదరాబాద్ లో ఉండడంతో.. గోదావరిఖని ఏసీపీ అపూర్వారావు మంగళవారం బాధితురాలి స్వగ్రామమైన పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications