'అధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేశారా? ఎవరు చెప్పారు?'
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని భాగ్యనగరంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు ఇలా ట్యాపింగ్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని హైదరాబాద్ నేర పరిశోధన విభాగం పోలీసు అధికారులు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చారు.
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా టిడిపి నేతలు మాట్లాడటం, తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందంటూ ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై లాయర్ల జెఏసి జూన్ 28న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాల ఆధారంగా పోలీసులు టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం సలహాలు, సూచనల కోసం న్యాయవిభాగానికి పంపించారు.
సర్వీస్ ప్రొవైడర్లకు తాఖీదులు పంపవచ్చునని సూచన రాగానే, ఆయా సంస్థలకు నోటీసులు పంపించారు. న్యాయవాదుల జెఏసి ప్రతినిధులు తమ ఫిర్యాదులో సర్వీస్ ప్రొవైడర్లు, కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటూ ప్రస్తావించారని, ప్రజాప్రతినిధుల పేర్లు లేకపోవడంతో దర్యాఫ్తు ఆలస్యమవుతుందని సిసిఎస్ అధికారులు చెబుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాధానం రాగానే కేసును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications