రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్నారు. అంతేగాక, తనతో పాటు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
తమ వ్యక్తి గత సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. మానకొండూరు సీఐకి కాన్ఫరెన్స్ పెట్టడం లేదని మంత్రి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసునని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.

సీపీ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పాడి కౌశిక్ రెడ్డి.
కేవలం 40 శాతం మందికే రుణాలు మాఫీ అయ్యాయని మిగిలిన వారికి అవ్వలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలకు హక్కు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీవి కావని, అవి ప్రజల సొమ్మేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థి చెక్కులు పంచుతున్నారని, దీనిపై హైకోర్టుకు వెళ్తానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
కాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పోలీసుల ఫోన్లు ట్యాపింగ్ చేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications