కంటతడి పెట్టిస్తున్న ఉల్లి: రైతు బజార్లలో బారులు (పిక్చర్స్)
హైదరాబాద్: ఉల్లిధరలు ఆకాశాన్నంటి ప్రజలకు కంటతడి పెట్టిస్తున్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకు ఉల్లిని అమ్ముతుండడంతో రద్దీ విపరీతంగా ఉంది. రైతు బజార్లలో ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరారు. దేశవ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో దిగుమతి అవకాశాలు కూడా తగ్గి, కోయకముందే ప్రజలను కంటతడి పెట్టిస్తోంది.
బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 80 నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు. ఇంత ప్రియమైన ఉల్లిని అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసే అవకాశం లేకపోవటంతో ప్రభుత్వం నగరంలోని పలు రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేసి రూ. 20కే కిలో విక్రయిస్తోంది.
ఆధార్ కార్డు నెంబర్‌ను రాసుకుని ఇస్తున్న ఈ ఉల్లి ఒక వ్యక్తికి కేవలం రెండు కిలోలు మాత్రమే ఇవ్వటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిని విక్రయించే కేంద్రాలు ప్రారంభమవుతున్నా, ఉదయం ఏడు గంటల నుంచే జనం ఉల్లి కోసం క్యూ కడుతున్నారు.

హైదరాబాదులో..
హైదరాబాదులోని రైతు బజార్లలో మంగళవారం సాయంత్రం ప్రజలు భారీగా బారులు తీరారు. కొద్దిపాటి ఉల్లిగడ్డల కోసం చెమటోడ్చారు.

ఒకేసారి ఎగబడకుండా..
ఉల్లిగడ్డల కోసం ఒకేసారి జనం ఎగబడకుండా నియంత్రించేందుకు ముందస్తుగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

ఏ మాత్రం సరిపోవడం లేదు..
చిన్న కుటుంబానికి నాలుగైదు రోజుల పాటు వచ్చే రెండుకిలోల ఉల్లి పెద్ద, ఉమ్మడి కుటుంబాల్లో కనీసం రెండురోజులకు సైతం సరిపోవటం లేదని కొనుగోలుదార్లు వాపోతున్నారు.

ఒకేసారి వస్తున్నారు...
రైతు బజార్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ తీరిక సమయంలో రైతుబజార్‌కు వచ్చి ఉల్లిని కొనుగోలు చేయవచ్చునని, అందుకే ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎక్కువ సంఖ్యలో జనం ఒకేసారి రావటంతో క్యూ కట్టక తప్పని పరిస్థితులేర్పడుతున్నాయి.

అవసరాలు తీరడం లేదు..
ఒక్కో రైతుబజార్‌లో రోజుకి నాలుగు నుంచి అయిదు టన్నుల ఉల్లి సబ్సిడీ ధరకు సరఫరా చేస్తున్నా, ప్రజల అవసరాలు తీరటం లేదు.

తాత్కాలికమేనని చెప్పినా..
ఉల్లి కొరత తాత్కాలిక కొరతనేనంటూ పాలకులు చెబుతున్నా, రోజురోజుకి కొరత తీవ్రమై మున్ముందు ఉల్లి ధర ఎంత ఘాటెక్కుతుందోనని కొనుగోలుదార్లు వాపోతున్నారు.

అసంతృప్తి అంతటా..
బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో, చైనీస్, మొఘలాయ్ వంటి డిష్‌లను ఉల్లిపాయ ముక్కలను నంచుకునే ఆరగించే భోజనప్రియులకు అసంతృప్తి మిగులుతోంది.

కనిపిస్తే ఒట్టు..
బిర్యానీతో పాటు ఇచ్చే సలాడ్ కేవలం క్యారెట్, కీరా ముక్కలకే పరిమితమై, ఉల్లి కన్పించకుండా పోయింది. హోటళ్లు, రెస్టారెంట్లలో ‘నో ఆనియన్ ప్లీజ్' అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇదే సమాధానం..
కిలో ఉల్లి రూ. 80 ఉండగా, అంతకన్నా తక్కువ ధరకే చికెన్, వెజిటెబుల్ బిర్యానీలు విక్రయించే హోటళ్లు భోజన ప్రియులకు ఉల్లి లేదనే సమాధానం చెబుతున్నారు.

ఎంతగా చెప్పినా...
రోజురోజుకి ధర పెరుగటం వల్లే ఉల్లి పాయ ఇవ్వలేకపోతున్నామని, అందుకు ప్రత్యామ్నాయంగా పలు హోటళ్లు కాస్త ఎక్కువ బిర్యానీ ఇచ్చి భోజనప్రియులను బుజ్జగించే దృశ్యాలు కన్పిస్తున్నాయి.

విశాఖనగరంలోనూ...
విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. కేవలం కిలో ఉల్లిపాయల కోసం జనం వెంపర్లాడ్డం వలనే ఈ పరిస్థితి దాపురించింది.

గంటల తరబడి
విశాఖ క్యూ లైన్లలో వేల సంఖ్యలో జనం ఉల్లిపాయల కోసం గంటల తరబడి నిలబడ్డ వైనం ఎప్పుడైనా చూశామా? కాళ్లు నొప్పులు పుట్టేలా నిలబడ్డా, కనీసం ఒక్క కిలో ఉల్లిపాయలైనా దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు.

విశాఖలో ఇలా..
బుధవారం నుంచి తెల్ల రంగు రేషన్ కార్డు ఉన్న వారికి వారానికి ఒక కిలో చొప్పున ఉల్లిపాయలు ఇస్తామని చెపుతున్నారు. ఉల్లి విక్రయ విధానంలో అధికారులు ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించలేకపోతున్నారు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఉద్రిక్త పరిస్థితి..
సోమవారం కంచరపాలెం రైతు బజార్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే, మంగళవారం ఎంవిపి, పెందుర్తి, మధురవాడ రైతు బజార్లలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మంగళవారం నగరంలోని ఐదు రైతు బజార్లలో 13 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను మాత్రమే విక్రయించారు












Click it and Unblock the Notifications