రైతులకు వరమిచ్చిన కేంద్రం.. ఏకంగా రూ.960 కోట్లు!
రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది. పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి అనేక పథకాలతో పాటు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం కూడా అందిస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో రైతాంగానికి వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి కృషి చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు జిల్లాల ఎంపిక
మెరుగైన నీటిపారుదలకు, ఉత్పత్తులను నిల్వ చేయడానికి, ఉత్పత్తుల విలువను పెంచే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయిస్తోంది.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు కేంద్రం వరాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను కేంద్రం గుర్తించగా అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. 2025- 2026 సంవత్సర బడ్జెట్లో ప్రకటించిన మేరకు కేంద్రం ఈ నిధులను ఆయా జిల్లాలకు అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ పథకం వర్తింపుపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట, జనగామ, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు కేంద్రప్రభుత్వం అందించే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా లబ్ధిని పొందడానికి అవకాశం కల్పించింది. ఇక ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
ఈ జిల్లాల ఎంపిక వెనుక కారణం ఇదే
దీంతో ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలను ఎంపిక చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ జిల్లాలలో తక్కువ ఉత్పాదకత, ఒకే పంటను సాగు చేయడం, సగటు కంటే తక్కువ రుణాల అందుబాటు వంటి కారణాలతో ఈ జిల్లాలు వ్యవసాయంలో వెనుకబడ్డాయి.
ఆరేళ్లపాటు 960 కోట్ల రూపాయల వార్షిక వ్యయం
ఇలా వ్యవసాయంలో వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి 960 కోట్ల రూపాయల వార్షిక వ్యయం ఆరేళ్లపాటు కేంద్రం అందిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడం, ఒకే పంటను సాగు చేయకుండా పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం చేస్తుంది.
36 కేంద్ర పథకాలను సమన్వయం చేసే వ్యవస్థ
తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను అందించడం, వ్యవసాయ అనంతరం పంటలను నిల్వచేసే ప్రాసెసింగ్ అంశాలకు ప్రాధాన్యత నివ్వడం, మైక్రో ఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించడం ఈ పథకం ద్వారా జరుగుతుంది. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం కేవలం ఒక పథకం మాత్రమే కాదు 11 మంత్రిత్వ శాఖలు విభాగాల కింద అమలులో ఉన్న 36 కేంద్ర పథకాలను సమన్వయం చేసే ఒక వ్యవస్థ.
రైతులకు ఇలా లబ్ది
ఇందులో అనేక పథకాలు భాగస్వామ్యం తీసుకుంటాయి. కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా జోడించి, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని రైతులు లబ్ధిని పొందవచ్చు. ఇక ఈ స్కీం ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో నాలుగు జిల్లాల రైతుల వ్యవసాయ ప్రగతికి దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications