ప్రధాని మోడీ సభ: గతంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్;మరి ఇప్పుడు మోడీ?
దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన ఇప్పుడు అన్ని వర్గాలలోనూ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీ వేదికగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు .
అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీని వరంగల్ తీసుకురావడం ప్రత్యర్థి పార్టీలను ఆలోచింపజేస్తుంది. గతంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించగా, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

వరంగల్ జిల్లా ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకంగా కేంద్రంలోని బిజెపి సర్కార్ వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ పదే పదే విమర్శలు గుప్పిస్తున్న వేళ, మొత్తం 6,110 కోట్ల అభివృద్ధి పనులతో వరంగల్ జిల్లా వేదికగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ప్రధాని మోడీ.
తెలంగాణలో బిజెపికి నూతన ఉత్సాహం రావడానికి ఏం చెప్పబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని చెప్పే ప్రయత్నం ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేస్తూనే, వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటనలు ప్రధాని మోడీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏదేమైనా మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టి మోడీ ప్రసంగంపైన కేంద్రీకృతమైంది.












Click it and Unblock the Notifications