ప్రధాని మోడీ పర్యటన: వేదికపై అవకాశం వారికే; పోలీసుల చక్రబంధంలో ఓరుగల్లు!!
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం ఓరుగల్లు ముస్తాబైంది. సుమారు 30 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని తొలిసారిగా వరంగల్ కు వస్తుండటం బిజెపి శ్రేణులలో జోష్ నింపుతోంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ప్రధాని అధికారిక కార్యక్రమాలకు కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రత్యేక సభావేదికను ఏర్పాటు చేశారు. ఈ సభావేదికపై కేవలం ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. దేశ ప్రధాని నరేంద్రమోడీతో పాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బండి సంజయ్, పసునూరి దయాకర్ మాత్రమే వేదికపై ఉంటారని కార్యాలయం ప్రకటించింది.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ చేసిన ప్రకటనతో సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వరంగల్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ డీజీపీ ల పర్యవేక్షణలో సుమారు 10,000 మంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లే ప్రాంతాలు, సభా ప్రాంగణం అంతా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో ఉంది. ఇప్పటికే నగరవాసులకు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్, ట్రాఫిక్ ను దారి మళ్ళించడానికి వివిధ రూట్ లను సూచించారు.
నరేంద్ర మోడీ పర్యటించే మార్గాలలో ఎటువంటి వాహనాలను అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సాగనుంది. అయితే వాతావరణం అనుకూలించక పోతే కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం ఉందని అధికారులు, బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications