ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటనలో స్వల్ప మార్పు: ఈ మూడు రోజుల్లోనే
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాజాగా, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది .అయితే, మొదట ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
మొదట ఈ నెల 16,17,18 తేదీల్లో పర్యటిస్తారని ప్రకటించగా.. ఇప్పుడు కాస్త మార్పు చేసి మార్చి 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిల్లో జరిగే సభలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. కాగా, మార్చి 15వ తేదీన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దాదాపు గంటన్నరకు పైగా రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది.

మంగళవారంనాటి అమిత్ షా సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై రోడ్ షో గురించి చర్చించారు. గురువారం రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్గిరి రోడ్ షోపై సన్నాహక సమావేశం జరగనుంది. మార్చి 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 18న జగిత్యాలలో ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.
మార్చి 16న ప్రధాని నరేంద్ర మోడీ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి రానున్నారని బీజేపీ నేత, జాతీయ బీసీ మాజీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి బహిరంగ సభాస్థలిని పరిశీలించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని స్థానిక నాయకులను కోరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆచారి.
బీజేపీ పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మొట్ట మొదటిగా ఎన్నికల ప్రచార సభను ఇక్కడి నుంచి ప్రారంభం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకే బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఈ సభకు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆచారి కోరారు.












Click it and Unblock the Notifications