భార్యను కాపురానికి పంపకపోతే మనవరాలి మార్ఫ్ద్ న్యూడ్ ఫోటోలు వైరల్.. అత్తను బెదిరించిన అల్లుడు!
తిరుపతి జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపకపోతే మనవరాలి ఫోటోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని అత్తను బెదిరించిన అల్లుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 35 సంవత్సరాల బిరుదాల ఈశ్వర్‌రెడ్డి తిరుపతి రూరల్ పరిధిలోని తుమ్మలగుంట ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి మొదటి భార్య వేధింపులు భరించలేక విడిపోయింది. తర్వాత అతడు తన పాత క్లాస్‌మేట్ కిన్నెరతో పరిచయం ఏర్పరచుకుని పెళ్లి చేసుకున్నాడు. కిన్నెరకు అప్పటికే 17 ఏళ్ల కుమార్తె ఉంది.

గతేడాది జనవరిలో ఈ మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం చేసినట్లు ఆరోపణలతో పోక్సో కేసు నమోదై జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ భార్యను కాపురానికి రమ్మని ఒత్తిడి చేశాడు. కిన్నెర నిరాకరించడంతో అత్త కమలమ్మపై విరుచుకు పడ్డాడు. గాజు సీసాతో దాడి చేసి గాయపరిచాడు. కమలమ్మ నెలరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందింది.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా బెదిరింపులు కొనసాగాయి.
కుమార్తెను దుబాయ్‌కు పంపించిన విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి, భార్యను తిరిగి పంపకపోతే మనవరాలి ఫోటోను మార్ఫ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. కొన్ని మార్ఫ్డ్ చిత్రాలను బంధువులకు కూడా పంపినట్లుచెప్పాడని ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి రూరల్ పోలీసులు మరోసారి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు.
కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇది అతడిపై రెండోసారి పోక్సో కేసు కావడం గమనార్హం. మైనర్ల భద్రత, సైబర్ నేరాలు, కుటుంబ వేధింపులు వంటి సమస్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా నేరగాళ్ల ప్రవృత్తిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఇలాంటి బెదిరింపులు చట్టపరంగా తీవ్రమైన నేరాలని పోలీసులు అంటున్నారు. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
