UPI లావాదేవీల ఛార్జీల అమలు పై కేంద్రం కీలక మార్పు..!?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే భారీ విలువ గల లావాదేవీలపై ప్రతిపాదించిన రుసుము అమలు విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది. వీటి అమలు పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ నిర్ణయం పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కొద్ది రోజులుగా యూపీఐ ద్వారా జరిగే రూ.2000పైన లావాదేవీలపై ప్రతిపాదించిన ఛార్జీల అంశం పైన వ్యతిరేకత కనిపించింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావటంతో ఈ ప్రతిపాదన అమలు ను కొన్ని నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, పండగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం రుసుమును అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతిపాదించింది. తాజాగా జరుగుతున్న చర్చల మేరకు ఈ గడువును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంవల్ల పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను ఆధునికీకరణకు సమయం ఉంటుంది.
కాగా, దసరా.. దీపావళి పెద్ద పండుగలు కావటంతో.. ఈ సమయంలో వ్యాపారులపై అదనపు ఛార్జీల భారం పడకుండా ఉంటుందని భావిస్తున్నారు. కాగా ఆరేళ్లకు పైగా ఎలాంటి రుసుము లేకుండా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపులపై ఈ ఛార్జీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇది వినియోగదారులకు ప్రత్యక్షంగా వర్తించదు. ఇది వ్యాపారుల వైపు నుంచి చెల్లించాల్సిన ఇంటర్‌ఛేంజ్ రుసుము. ప్రస్తుతం దేశంలో 50 కోట్లకుపైగా యూపీఐ వినియోగదారులు ఉన్నారు.
ఆగస్టు 2026 లోనే యూపీఐ ద్వారా రూ.29.82 లక్షల కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఛార్జీల అమలు మొదలుపెడితే అది దసరా, దీపావళి వంటి పండగల వేళ వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కీలక సమయంలో రిటైల్ చెల్లింపులకు అంతరాయం కలగకుండా చూడాలనే లక్ష్యంతో అమలు నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు సమాచారం.














Click it and Unblock the Notifications
