భూ వివాదంలో ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే... కేసు నమోదు చేసిన పోలీసులు...
ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. కాప్రాలోని సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే తమ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఎమ్మెల్యేతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్‌పై జవహర్ నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.దీనిపై ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
ఇటీవలి కాలంలో తెలంగాణలో భూ వివాదాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే నెలలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో పౌల్ట్రీ విస్తరణ కోసం అసైన్డ్ భూములను ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికార యంత్రాంగం ఆరోపణలు నిజమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాయి. దీంతో ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.

ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డిపై కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామంలోని సర్వే నంబర్ 77లో 10 ఎకరాల భూమిని నితిన్ రెడ్డి కబ్జా చేశారని సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదులు అందాయి. మహేశ్ అనే రావల్‌కోసి వాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై ఏసీబీ,విజిలెన్స్‌తో విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ పదెకరాల భూమి తమదేనని మహేశ్ అనే వ్యక్తి చెబుతున్నారు. 1954 నుంచి 1986 పహాణీ వరకు రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి తన తాత పేరు మీదే ఉందన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తన తాత పేరుతో ఉన్న భూములకు అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందారని ఆరోపించారు. 8 నెలల క్రితం ఇదే విషయమై ఈటలను కలిసి న్యాయం చేయాలని కోరితే మళ్లీ రావొద్దని తననే బెదిరించినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి తనకు న్యాయం చేయాలని విన్నవించారు.












Click it and Unblock the Notifications