ఇద్దరు ఐఏఎస్, ఓ ఐపీఎస్: ప్రతీకారం కోసం నయీంని వాడుకుంది, రూ.కోటి గిఫ్ట్
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రోజుకో కొత్త విషయం, షాకింగ్ విషయం వెలుగు చూస్తోంది. తాజాగా మరో కొత్త కోణం బయటకు వచ్చింది. నయీంకు ఇద్దరు ఐఏఎస్, ఓ ఐపీఎస్ అధికారితో సంబంధాలు ఉన్నట్లుగా సిట్ దర్యాఫ్తులో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. వీటిని అధికారులు నిర్ధారించాల్సి ఉంది.
పై అధికారులు నయీంను ప్రతీకారం కోసం వాడుకున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. నయీంకు మేలు చేసిన ఓ ఐఏఎస్ అధికారి అతని నుంచి బహుమతి కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. మరో అధికారి నయీంతో ఆర్థిక లావాదేవీలు నడిపాడని సమాచారం.
మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఓ హత్య సంచలనం రేపింది. ఈ హత్య కేసును తారుమారు చేయడంలో ఓ ఐపీఎస్ అధికారి కీలక పాత్ర పోషించారని అంటున్నారు. ఈ హత్య వెనుక నయీం ఉన్నాడని తెలుస్తోందని అంటున్నారు.

తనకు మేలు చేసిన సదరు ఐఏఎస్ అధికారికి నయీం రూ.కోటి నజరానా ఇచ్చారని తెలుస్తోంది. ఈ అంశాలన్నింటి పైన సిట్ దర్యాఫ్తు చేస్తోంది. ఈ మధ్య ఓ ఐఏఎస్ అధికారి.. నయీం మనుషుల పైన పీడీ యాక్ట్ అమలు కాకుండా చేశారని అంటున్నారు.
గతంలో మహబూబ్ నగర్‌లో సంచలనం రేపిన హత్యను... ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఆ ప్రమాదం సమయంలో స్థానిక పోలీసులు రాకముందే ఓ అధికారి అక్కడకు చేరుకున్నారని తెలుస్తోంది. ఆ ప్రమాదం రోడ్డు ప్రమాదం అని తేల్చినా, అది హత్య అని పోలీసులు తేల్చారని అంటున్నారు.
ఇళ్లకు సినిమాలు, ప్రాంతాల పేర్లు
నయీంకు దాదాపు ఇరవై ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఆ ఇళ్లన్నింటికీ పేర్లు పెట్టాడని తెలుస్తోంది. ఆ ఇళ్లకు సినిమాలు, ప్రాంతాల పేర్లు పెట్టాడు. అంతేకాదు, నయీం తన చావు తర్వాత తనతో పాటు అక్రమాలకు పాల్పడ్డ వారందరి లింకులు బయటపడేలా.. డైరీలు, డాటా తయారు చేసి పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, నయీం 250 కంటే ఎక్కువ మంది నుంచి ప్రతి నెల కప్పం వసూలు చేసేవాడని, వాటిని వసూలు చేసేందుకు వందలాది మందికి వేతనం ఇచ్చి పెట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications