హైదరాబాద్‌లో డ్రగ్స్ రచ్చ.. పరారీలో స్టార్ హీరోయిన్ సోదరుడు..?
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ మాఫియా వ్యవహరం అందరికీ షాక్ ఇస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మాసబ్‌ట్యాంక్ పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటపడటం కలకలం రేపుతోంది.
భారీగా డ్రగ్స్ స్వాధీనం..
కాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు, తెలంగాణ 'ఈగల్ టీం' సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్‌తో పాటు ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఆ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అమన్ ప్రీత్ సింగ్ తరచూ ఈ వ్యాపారుల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో అతని కోసం ఈగల్ టీం, మాసబ్‌ట్యాంక్ పోలీసులు కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గతంలోనూ డ్రగ్స్ కేసులో..
అయితే ఇప్పటికే గత ఏడాది సైబరాబాద్ పోలీసులకు సంబంధించి నమోదైన ఒక డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడి, అనంతరం బెయిల్‌పై విడుదలైనట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై జరుగుతున్న ఈ చర్యలు సినీ పరిశ్రమలోనూ విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.












Click it and Unblock the Notifications