సికింద్రాబాద్ లో భారీగా మోహరించిన పోలీసులు- తీవ్ర ఉద్రిక్తత
సికింద్రాబాద్ లో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం నుంచి ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. తమ ఆందోళనలో భాగంగా ఇక్కడ భారీగా తరలివచ్చిన భారత్ రాష్ట్ర సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఆనవాళ్లను తుడిచివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దీనికి నాయకత్వం వహించారు. 'బచావో సికింద్రాబాద్' పేరుతో నేడు రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

దీనికి భారీగా బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు. నల్ల కండువాలను మెడలో వేసుకుని, నల్ల జెండాలను పట్టుకుని ర్యాలీకి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు రైల్వే స్టేషన్ కు చేరుకుంటోండటంతో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్యారడైజ్, ఇతర ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ పేరును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తోన్నారు. సికింద్రాబాద్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, దీని పేరు మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. నల్ల జెండాలు, కండువాలు ధరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు సాగుతున్న ర్యాలీని ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టీ హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే తమ ఏడవ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే తమ పాలసీ అని నిరూపిస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోవద్దని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిర్బంధాలకు భయపడేది లేదని, చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం ఆగబోదని అన్నారు.












Click it and Unblock the Notifications