అధికారం ఎవడబ్బ సొత్తు కాదు: కేసీఆర్ సర్కారుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనం
గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తాజాగా, అధికార పార్టీపై నేరుగా విమర్శలు సంధించారు.
హైదరాబాద్: గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తాజాగా, అధికార పార్టీపై నేరుగా విమర్శలు సంధించారు. సోమవారం ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రెండోసారి అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారంటూ ప్రశ్నించారు.

అధికారం ఎవడబ్బ సొత్తు కాదంటూ కేసీఆర్ సర్కారుపై పొంగులేటి
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ వస్తుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు 20 శాతమే రుణమాఫీ జరిగిందన్నారు. అధికారం ఎవడబ్బ సొత్తు కాదు.. తాను పెట్టే అభ్యర్థులంతా విజయం సాధించి తీరుతారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అధికార మదంతో ఇబ్బందులు పెడుతున్నారని పొంగులేటి ఫైర్
తాను తప్పు చేయలేదని.. వెనుకడుగు వేసేది లేదంటూ స్పష్టం చేశారు. తాత్కాలికంగా ఇబ్బంది పడినా విజయం మనదేనంటూ అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు. నాకు, నన్ను నమ్ముకున్న నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. ప్రజల అభిమానం పొందలేక ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నా వల్లనే ఓడిపోయారని తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఇవి నమ్మి.. నాకు సీటు ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకు సీటు ఇచ్చారు. అధికార మదంతో నాతో ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేశారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటి ఏ పార్టీలో చేరతారనేదానిపై ఉత్కంఠ
కాగా, గత కొంత కాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నెక్ట్స్ ఏ పార్టీలో చేరతారన్న ఆసక్తి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే పొంగులేటిని కలిశారు కాంగ్రెస్ నేతలు. అయితే, పొంగులేటి మాత్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. మరోవైపు, ఇటీవల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కావడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేక షర్మిల పార్టీలో చేరతారా? అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు బీజేపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. కానీ, పొంగులేటి మాత్రం ఆ వైపు అడుగులు వేయనట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications