టి ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధమే: పొన్నాల
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికి దిగుతున్నామని టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ బుధవారం ఏఐసిసి కార్యాలయంలో తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్య, శాసన సభాపక్ష నేత జానారెడ్డి, విధాన మండలిలో పార్టీ పక్షనేత డి శ్రీనివాస్, టి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపి రేణుకాచౌదరి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఎల్‌సి పి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపి బలరాం నాయక్‌తో సమావేశమైన దిగ్విజయ్ సింగ్.. టి కాంగ్రెస్‌కు సంబంధించిన పలు అంశాల గురించి రెండున్నర గంటలపాటు చర్చించారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం, తుపాను బాధితులకు సహాయం చేయటం, పోలవరం ప్రాజెక్టు మూలంగా దిగ్బంధానికి గురవుతున్న ఖమ్మం జిల్లాలోని నాలుగు గ్రామాలు, ఈ జిల్లాలోని ఏడు మండలాను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయటం వలన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణాలో పార్టీ సభ్యత్వ నమోదు వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

సమావేశానంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రజావసరాలను పక్కన పెట్టి రాజకీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై ప్రత్యక్ష పోరాటం చేసేందుకు టి కాంగ్రెస్ సిద్ధమవుతోందని తెలిపారు.
ఈ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీలు, సంస్థలు, గ్రూపులతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కొరత మూలంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు రుణాలు అందటం లేదని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లాకు త్వరలోనే డిసిసి అధ్యక్షుణ్ని నియమిస్తామన్నారు.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో తన వర్గానికి చెందిన వారిని పార్టీ నుండి పంపించివేసేందుకు కుట్ర జరుగుతోందని, పిసిసి అధ్యక్షుడు తన వర్గం వారిపై ఏకపక్షంగా చర్యలు తీసుకుంటున్నారంటూ రేణుకా చౌదరి ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన ఫిర్యాదు లేఖపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామే తప్ప ఇతరులపై కాదని లక్ష్మయ్య స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అధిష్టానానికి వివరించారు.












Click it and Unblock the Notifications