కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఒక భ్రమ; దేశానికి నాయకత్వమా.. నీ బలమెంత కేసీఆర్? పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రాజకీయాల విషయంలో రచ్చ కొనసాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ బంగారు భారతదేశం నిర్మిద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారని, దేశాన్ని ఉద్దరిస్తారు అంటూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా? ఇక బంగారు భారతదేశం దాకా కథ వచ్చిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా టీపిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ బంగారు భారత్ నినాదం హాస్యాస్పదం : పొన్నాల లక్ష్మయ్య
సీఎం కెసిఆర్ బంగారు భారతదేశం నినాదం హాస్యాస్పదంగా ఉందని మాజీ టిపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ ఇప్పుడు దేశం వైపు చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. కూట్లో రాయి తీయ లేనివాడు ఏట్లో రాయి తీస్తాడంట అన్నట్లుగా కెసిఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

దేశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తానని కేసీఆర్ చెప్తున్నారు
తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగాలను, పోరాటాలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాక ఇప్పుడు దేశాన్ని కూడా భ్రష్టు పాటిస్తానని కెసిఆర్ చెబుతున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పొన్నాల లక్ష్మయ్య. దేశానికి నాయకత్వం వహించడానికి కేసీఆర్ కు ఉన్న బలమెంత? ఆయన అనుభవం ఎంత? అంటూ సూటిగా ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఒక భ్రమ
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఒక భ్రమ అని పొన్నాల లక్ష్మయ్య అభివర్ణించారు. తన ఎనిమిది ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునైనా కెసిఆర్ పూర్తి చేశారా అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో ఒక ఎకరానికి అయినా నీళ్లు ఇచ్చాడా అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న నీచమైన చరిత్ర కేసీఆర్ దని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక, ఇప్పుడు దేశం వైపు కూడా చూస్తున్నారు అంటూ పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

కెసిఆర్ నక్కజిత్తుల మాటలకు కాలం చెల్లిపోయింది
ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు ఇంకా కేసీఆర్ ను నమ్మబోరని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కెసిఆర్ నిజస్వరూపం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కెసిఆర్ నక్కజిత్తుల మాటలకు కాలం చెల్లిపోయింది అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో దేశ రాజకీయాల పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోడీ సైకిల్ టెర్రరిస్ట్ వ్యాఖ్యలపై పొన్నాల ఫైర్
ప్రధాని మోడీ పై మండిపడిన పొన్నాల లక్ష్మయ్య సైకిల్ టెర్రరిస్టు సమాజ్ వాదీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని పేర్కొన్నారు. దేశ ప్రధానిగా పనిచేస్తున్న వారు ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో ఏదిబడితే అది మాట్లాడడం సమంజసం కాదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. చేతకాని అసమర్ధులు దేశాన్ని పరిపాలిస్తున్నారు అని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications