ఇక లాంఛనమే- జనగామ సభలో..
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు బీఫామ్‌లను అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ.. 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా (Telangana Congress first list 2023)ను విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీ సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీలిమా రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి సీనియర్లు తొలి జాబితాలో ఉన్నారు.
అదే సమయంలో- పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం రాత్రి ఆయన ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో ఆయన వెంట బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, దాసోజు శ్రవణ్ ఉన్నారు.

ఇటీవలే పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదనే కారణంతో పార్టీ నుంచి బయటికి వచ్చారు. అప్పుడే ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. తమ పార్టీలో చేరాలంటూ స్వయంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్‌తో పొన్నాల భేటీ అయ్యారు కూడా.
తాజాగా- ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. దీనితో- బీఆర్ఎస్‌లో పొన్నాల చేరిక లాంఛనప్రాయేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మధ్యాహ్నం జనగామలో జరిగే బహిరంగ సభలో.. కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువాను కప్పుకొంటారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications