నిరుద్యోగం లేని తెలంగాణా మా లక్ష్యం .. అందుకే యూత్ డిక్లరేషన్: ప్రియాంకా గాంధీ
హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన యువ సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ మాట్లాడారు. జై బోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె మిత్రులారా..ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ అమరవీరుల ప్రాణాలు అర్పించారో ఆ ఆశయం నెరవేరలేదు అని తెలుగులో మాట్లాడారు.
తెలంగాణ నేల కాదు.. తెలంగాణ తల్లి లాంటిదని పేర్కొన్న ప్రియాంక గాంధీ ఈ తల్లి కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారు అని గుర్తు చేశారు . నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని పేర్కొన్న ప్రియాంక గాంధీ నాడు ఎంతో మంది యువత బలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం తమ కుటుంబీకులు సైతం అమరులయ్యారు అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని,తాము అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిన తర్వాత ప్రస్తుతం తెలంగాణలో జాగీర్దార్ల పాలన సాగుతోందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం కాదని ప్రియాంక గాంధీ విమర్శించారు.
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ అయినా ఇప్పటికి చర్యలు తీసుకోలేదని, తెలంగాణ యూనివర్సిటీ లలో ఇప్పటివరకు నియామకాలు లేవని ఆమె అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద అప్పుల భారం పడుతుందని, రాష్ట్ర సంపద ఎక్కడికి పోతుంది? ప్రజల డబ్బులు ఏమవుతున్నాయి? అనేది ఎవరికీ తెలియదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు యువ సంఘర్షణ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రియాంక గాంధీ. తాము మాట తప్పితే తమను గద్దె దించాలని సూచించారు. యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. తను సోనియాగాంధీ కుమార్తెనని నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు .
నిరుద్యోగం లేని తెలంగాణను రూపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ప్రియాంకగాంధీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు 25 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని, క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని,నిరుద్యోగులకు నాలుగువేల భృతి ఇస్తామని, ప్రత్యేక గల్ఫ్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు చదువుకునే ప్రతి ఆడబిడ్డ కు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications