
బొంతు రామ్మోహన్ అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం.. స్పందించిన గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఎప్పుడు ఎవరి పైన ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది. తాజాగా నిన్నటికి నిన్న ఫేక్ సిబిఐ అధికారి శ్రీనివాస్ అరెస్టు కేసులో మంత్రి గంగుల కమలాకర్ కు, టిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నేడు వారు సిబిఐ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తాజాగా బయటకు రావటంతో ఆయన స్పందించారు.

అజ్ఞాతంలో బొంతు రామ్మోహన్ ప్రచారం..
బొంతు రామ్మోహన్ మొబైల్ ఫోన్ స్విచాఫ్ వస్తున్న క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు అన్న ప్రచారం జోరుగా జరిగింది. గత మూడు రోజులుగా బొంతు రామ్మోహన్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, దీంతో ఫేక్ సిబిఐ అధికారి కేసులో బొంతు రామ్మోహన్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారన్న చర్చ జరుగుతుంది. అయితే బొంతు రామ్మోహన్ ఎక్కడ ఉన్నాడు? ఆయన మొబైల్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? నిజంగానే బొంతు రామ్మోహన్ ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఎందుకు చేస్తారు? బొంతు రామ్మోహన్ కు ఈ వ్యవహారంలో ఉన్న సంబంధం ఏంటి? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న సమయంలో బొంతు రామ్మోహన్ దీనిపై స్పందించారు.

స్పందించిన బొంతు రామ్మోహన్ .. తాను ఎక్కడికీ వెళ్లలేదని వ్యాఖ్య
అయితే తాజాగా తన పై జరుగుతున్న ప్రచారంపై బొంతు రామ్మోహన్ స్పందించారు తాను ఎక్కడికీ వెళ్లలేదని హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన చెప్పారు. కానీ కనిపించకపోయేసరికి కొందరు మీడియా మిత్రులు ఊహించుకొని వార్తలు రాస్తున్నారని బొంతు రామ్మోహన్ అన్నారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని బొంతు రామ్మోహన్ విమర్శించారు. సిబిఐ విచారిస్తున్న శ్రీనివాస్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్న బొంతు రామ్మోహన్, కమ్యూనిటీ కి సంబంధించిన ఒక ఫంక్షన్లో కొందరు నాయకులను శ్రీనివాస్ కలిశారని ఇదే విషయాన్ని గంగుల కమలాకర్ కూడా చెప్పారని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

తెలంగాణాలో జరుగుతున్నది రాజకీయ కుట్రలో భాగం
శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పుచేస్తే తమకేం సంబంధం అని ప్రశ్నించిన బొంతు రామ్మోహన్, అతను చేసిన తప్పులతో మాకేం సంబంధం ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్నదంతా రాజకీయ కుట్రలో భాగమని బొంతు రామ్మోహన్ తెలిపారు. తన దగ్గర నుంచి 20 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై స్పందించిన బొంతు రామ్మోహన్ అటువంటి లావాదేవీలు ఏవీ జరగలేదన్నారు. తనకు సిబిఐ అధికారులు నోటీసులు కూడా జారీ చేయలేదని, ఒకవేళ జారీ చేస్తే తనను తాను నిరూపించుకుంటానని పేర్కొన్నారు.

తెలంగాణాలో షాకింగ్ రాజకీయ పరిణామాలు
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ని తీసుకు వస్తున్నాయి. ఇక తాజాగా బొంతు రామ్మోహన్ వ్యవహారంలోనూ ఆయన అజ్ఞాతంలో ఉన్నారని జరిగిన ప్రచారం కూడా ఒక్కసారి అందరినీ ఆలోచించేలా చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను, మంత్రులను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా నకిలీ సీబీఐ ఆఫీసర్ కేసులో సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ప్రతిఘటనకు కేరాఫ్ వరంగల్; చిరంజీవి నుండి వైఎస్ షర్మిల వరకు దాడులపై ఆసక్తికర చర్చ!!