విషాదం: కృష్ణా నదిలో పుట్టి మునిగి.. నలుగురు గల్లంతు
హైదరాబాద్: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంకు కొంత మంది పుట్టిలో వెళ్తుండగా వరద ప్రవాహంలో పుట్టి నీట మునిగింది.
ఈ ప్రమాదంలో తొమ్మిది మందిని మరో పుట్టిన ప్రయాణిస్తున్నవారు కాపాడారు. అయితే, ఓ చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు నదిలో గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టారు.
కాగా, గల్లంతైన వారు కురవపురానికి చెందిన తల్లి సుమలత, కుమార్తె రోజా, పార్వతమ్మ, నరసమ్మగా గుర్తించారు. తెలంగాణలో ఐదారురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇది ఇలావుంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్.. సిద్దిపేట జిల్లా శనిగరం-బద్దిపల్లి రోడ్డులోని వాగులో ఆయన కారుతో సహా గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి శ్రీనివాస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇన్నోవా వాహనంలో మంథనికి బయల్దేరారు.
ఈ క్రమంలో మద్దికుంట వాగులో వీరు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా.. కారుతోపాటు శ్రీనివాస్ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఘటనా స్థలికి సిద్దిపేట ఆర్డీవో చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications