డీజీపీ సహా 15 మంది ఏపీకి వెళ్లాల్సిందే: కేసీఆర్ సర్కారుపై రఘునందన్ రావు విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పనిచేయాలన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు.
కానీ, కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) పేరుతో సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 15 మందిని పంపకుండా అడ్డుకున్నారని రఘునందన్ రావు విమర్శించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తరహాలోనే ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాలకు పంపించాలన్నారు. ఈ ప్రక్రియను ముందుగానే చేసివుంటే చాలా తప్పిదాలు జరిగి ఉండేవి కాదన్నారు.

తెలంగాణ డీజీపీని కూడా ఏపీ కేడర్‌కు కేటాయించారని.. ఆయనను కూడా అక్కడికి పంపించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
ఐఏఎస్‌ల కేటాయింపు కేసుపై జనవరి 27న విచారణ జరుగుతుందని చెప్పారు. 13 మందిపై 13 సార్లు వేర్వేరుగా పిటిషన్లు, తీర్పులతో సమయం వృథా కాకుండా ఈ కేసు మొత్తాన్ని ఒకటిగా పరిగణించి తీర్పు ఇవ్వాలని కోరారు.
మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు రఘునందన్ రావు. తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదన్నారు. మియాపూర్ పరిధి హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 78కి సంబంధించి భూమిని ఇతరులకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం.. 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. దీనిపై సీఎస్ శాంతి కుమారి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్ కు బహిరంగ లేఖ కూడా పంపించామని తెలిపారు. అంతేగాక, సీఎస్ కార్యాలయానికి ఫోన్ చేసి.. సోమవారం నుంచి శుక్రవారం లోపు సమయం ఇవ్వాలని సీఎస్‌ను రఘునందన్ కోరారు.తమకు ప్రభుత్వం, ప్రగతిభవన్ గేట్లు ఎలాగూ తెరచుకోవంటూ విమర్శించారు.












Click it and Unblock the Notifications