కేటీఆర్‌ను రేవంత్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు: చీకటి ఒప్పందం అంటూ రఘునందన్ రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న సందర్బంగా రఘునందన్ రావు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎఫ్-1 రేస్ కార్లకు ఎలాంటి జీవో లేకుండా కేటీఆర్ చెబితే రూ.50 కోట్ల ఇచ్చామని హెచ్ఎండీఏ గ్రోత్ కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పి ఆరు నెలలవుతున్నా ..కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
దీనిపై రేవంత్ రెడ్డి కేటీఆర్‌తో అమెరికాలో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారేమో తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మొదటి నుంచి తోడుదొంగల పార్టీలు అని రఘునందన్ విమర్శించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మబొరుసు లాంటివని అభివర్ణించారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుంకిశాల విషయంలో రెండు పార్టీలు ప్రెస్మీట్లతో సరిపెడుతున్నాయి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీ ఆరోపించారు.

సుంకిశాల కూలిపోయిన విషయంపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్‌కి దమ్ము లేదని రఘనందన్ విమర్శించారు. పాలకపక్షం నిద్రపోతే ప్రతిపక్ష బాధ్యత బీఆర్ఎస్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో రూ.1000కోట్లకు నోటీసులిచ్చిన హెచ్ఎండీఏ అధికారి అరవింద్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని రఘునందన్ నిలదీశారు.
తప్పు చేసిన వాడు కొడుకైనా, కుమార్తైనా శిక్షించడానికి వెనుకాడనని ఆనాడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారని.. కానీ ఆయన మనసు ఒప్పలేదన్నారు రఘునందన్. సీఎం రేవంత్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేతల్లో ఏమీ చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరు అత్త కొట్టింది కోడలు ఏడ్చింది అన్న చందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు రఘునందన్ రావు.












Click it and Unblock the Notifications