తెలంగాణలో రాహుల్ యాత్ర షురూ - పార్టీ పరిస్థితిపై ఆరా..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ గుడి బెల్లూరు వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు భారీ స్వాగత ఏర్పాట్లు చేసారు. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎర్మాసూర్ నుంచి మొదలైన రాహుల్ పాదయాత్ర కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించారు. పార్టీ నేతలకు ఆయనకు జాతీయ జజెండాను అందించారు. మరి కాసేపట్లో రాహుల్ సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ కు స్వాగత తోరణాలతో పాటుగా సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీని తాజా పరిస్థితుల పైన ఆరా తీసారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి పార్టీ నేతల గురించి వాకబు చేసినట్లు తెలుస్తోంది.
ఈ రోజు తెలంగాణలో రాహుల్ యాత్ర 4 కిటో మీటర్ల మేర సాగింది. కాసేపట్లో రాహుల్ ప్రసంగించనున్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీపావళి పండుగ కావటంతో రాహుల్ తన యాత్రకు మూడు రోజుల విరామం ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వెళ్తారు. 26న ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి 27వ తేదీ ఉదయం నుంచి రాహుల్ యాత్ర కొనసాగనుంది. మొత్తం ఏడు జిల్లాలు, ఏడు లోక్ సభ నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. నారాయణపేట జిల్లాలో ఎంట్రీ అయ్యే యాత్ర.. మహబూబ్ నగర్ జిల్లా మీదుగా రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు.

మొత్తం 12 రోజులు 375 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. నవంబర్ 7వ తేదీన కామారెడ్డిజిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని శాఖాపూర్ లో యాత్ర ముగుస్తుంది. రాహుల్ రోజుకు 20 నుంచి 25 కిలో మీటర్ల మేర ప్రజలతో మమేకమవుతూ యాత్రలో పాల్గొంటారు. పలు ప్రధాన ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 6న వెల్లడి కానున్నాయి. ఆ మరుసటి రోజు రాహుల్ యాత్ర తెలంగాణలో ముగియనుంది. రాహుల్ తెలంగాణలో ఉన్న సమయంలోనే మునుగోడు ఎన్నిక జరగటంతో పాటుగా ఫలితాలు కూడా వెల్లడి కానుండటంతో కాంగ్రెస్ నేతలకు ఈ ఉప ఎన్నిక సవాల్ గా మారుతోంది.
ఇక, ఇదే సమయంలో సోనియా గాంధీ - ప్రియాంక కూడా హైదరాబాద్ లో రాహుల్ తో పాటుగా యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మునుగోడు బై పోల్ మరో వైపు రాహుల్ యాత్రతో రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications