తెలంగాణకు నేడు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే: వరంగల్‌లో పాదయాత్ర, అటు మేనిఫెస్టో
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జాతీయ నాయకులు కూడా ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు.
రాష్ట్రంలోని పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రాహుల్ గాంధీ ప్రచారం కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పినపాక నుంచి హెలికాప్టర్లో.. నర్సంపేటకు చేరుకుని 3 గంటల వరకు ప్రచారం చేస్తారు.

నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ పాదయాత్ర చేస్తారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌లో కూడా ప్రచారం నిర్వహిస్తారు రాహుల్. ఇక్కడ ప్రచారం అనంతరం హెలికాప్టర్లో రాహుల్ హైదరాబాద్ చేరుకుని.. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళతారు.
రాహుల్ గాంధీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. నవంబర్ 17న నర్సంపేట నియోజకవర్గంలో పర్యటనను ముగించుకొని నేరుగా మామునూరు విమానాశ్రయానికి వస్తారని తెలిపారు. అనంతరం రోడ్డు మార్గంలో వరంగల్ చౌరస్తాకు చేరుకుంటారని తెలిపారు. వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ రుద్రమదేవి కూడలి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. అలాగే రుద్రమదేవి కూడలిలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావాలని కొండా సురేఖ కోరారు.
మరోవైపు, శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో మల్లిఖార్జున ఖర్గే బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. 11-12 గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారు ఖర్గే. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి హైదరాబాద్‌లోనే మల్లిఖార్జున ఖర్గే బస చేయనున్నారు.












Click it and Unblock the Notifications