డిసెంబరు 8న రాహుల్ పట్టాభిషేకం.. వడివడిగా ఏర్పాట్లు!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ముహూర్తం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆ పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ముహూర్తం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
ప్రస్తుతం రాహుల్ క్రేజ్ పీక్ స్టేజిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఈ పని కానిచ్చేయడం పార్టీకి లాభదాయకమని కూడా అధిష్ఠానం భావిస్తోంది. రాహుల్ కనుక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తే నెహ్రూ కుటుంబం నుంచి ఈ పదవి చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు.

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావిస్తోంది. సోమవారం జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.
నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పరిశీలన, ఓటింగ్ తదితర ప్రక్రియల తేదీలను నిర్ణయించనున్నారు. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక ఏకగ్రీవమైతే ఏ సమస్యా ఉండదుకానీ, ఒకవేళ ఆయనకు పోటీగా ఎవరైనా బరిలోకి దిగితే మొత్రం ఈ మొత్తం ప్రక్రియకు 14 రోజులు పడుతుంది.
మరోవైపు గుజరాత్ లో తొలి విడత పోలింగ్ డిసెంబరు 9న, రెండో విడత 14న జరగనుండగా 18న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఈలోపే పార్టీ పగ్గాలు రాహుల్‌కు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.












Click it and Unblock the Notifications