రాహుల్ గాంధీ పర్యటన: ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర స్వాగతం; కేసీఆర్ బిడ్డనా.. మజాకానా!!
నేటి నుండి రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన కొనసాగనుంది. శుక్రవారం వరంగల్ లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో రాహుల్ పర్యటనను సక్సెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీకి స్వాగతం చెప్తూనే అనేక ప్రశ్నలను సంధించారు. కేసీఆర్ బిడ్డనా .. మజాకానా అనేలా చేశారు.
రాహుల్ గాంధీకి కవిత ఆసక్తికర ఆహ్వానం
ప్రియమైన రాహుల్ గాంధీ గారు, రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆసరా వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ దేశానికి సమగ్ర అభివృద్ధి మార్గాన్ని చూపింది. అవి ప్రతిరోజూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తూనే ఉన్నాయి అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని సాధిస్తుందని కవిత వెల్లడించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజూ ప్రయోజనం చేకూర్చే పథకాలను 11 రాష్ట్రాలు అనుకరిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాలను గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుండి నేర్చుకోవడానికి, ఇక్కడ అందిస్తున్న సంక్షేమాన్ని అర్థం చేసుకోవడానికి వస్తున్న మీకు స్వాగతం అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు
ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీకి అనేక ప్రశ్నలను స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణాకు వస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి ఆయన వస్తున్న సమయంలో తాను అడుగుతున్న విషయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని తాను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. తాను ప్రస్తావించిన తెలంగాణ అంశాలపై పార్లమెంట్లో ఎన్ని సార్లు రాహుల్ గాంధీ ప్రస్తావించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.

అప్పుడు మీరెక్కడున్నారు రాహుల్ జీ .. ఓ రేంజ్ లో కవిత
ఇక దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావలసిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు అంటూ కవిత నిలదీశారు.
కెసీఆర్ సంక్షేమ పథకాలను అర్ధం చేసుకోవటానికి వస్తున్న మీకు స్వాగతం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలపై ఆరా తీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి అంటూ ఎమ్మెల్సీ కవిత హితవుపలికారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్న కవిత వాటిని అర్థం చేసుకుని నేర్చుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం అంటూ రాహుల్ గాంధీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత.












Click it and Unblock the Notifications