హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతీ వారం ప్రత్యేక రైలు- టైమింగ్స్ ఇలా..!!
రామమందిర్ దర్శనానికి వెళ్తున్న తెలుగు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేళ దేశ వ్యాప్తంగా వెయ్యి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రతీ శుక్రవారం ఈ ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది.
ప్రతీ వారం ప్రత్యేక రైలు : రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

తెలుగు ప్రజల కోసం : 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు. చారిత్రాత్మక రామాలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం రాష్ట్రం నుంచి 11 ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీరామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠ ఈనెల 22న జరగనుంది. బాలరామ (రామలల్లా) విగ్రహాలకు పూజలు చేసి రామమందిరాన్ని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు.
కర్ణాటక నుంచి 11 రైళ్లు : కర్ణాటక రాష్ట్రం నుంచి 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటక - గోవా నుంచి రెండు రైళ్లు బయల్దేరనుండగా, కర్ణాటక నుంచి అయోధ్యకు నేరుగా మిగిలిన 9 రైళ్లు సంచరించనున్నాయి. ఈనెల 31 తర్వాత ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ మినహా నేరుగా టికెట్లు విక్రయించే వెసులుబాటు ఉండదు. అయోధ్యలో రైళ్లు నిలిపేందుకు అనుగుణంగా ఏ రాష్ట్రం నుంచి ఎన్ని రైళ్లు సంచరించాలో నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక నుంచి 11 రైళ్లకు అవకాశం లభించనుంది.












Click it and Unblock the Notifications