జాగ్రత్త.. తెలంగాణాకు హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు నమోదు కాగా, మరికొన్ని జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం వర్షాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక భారీ వర్షాలు కురుస్తున్న అనేక జిల్లాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మరో రెండు రోజులు వర్షాలు
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఇది ఇలా ఉంటే మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు ఈ జిల్లాలలోనే వర్షాలు
నేడు తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు అధికారులు .ఈ జిల్లాలలో నేడు భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో వాతావరణం ఇలా
ఈ జిల్లాలలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే వారు చెట్ల కిందకు వెళ్లకుండా ఉండాలని, మొబైల్ ఫోన్లు బయట వాడకుండా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో ఉదయం అంతా వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రానికి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఇలా
కాబట్టి నగర ప్రజలు సాయంత్రం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని హెచ్చరిస్తున్నారు. కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి ఉధృతి స్థిరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47.3 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నేడు వర్షాలతో బీ అలెర్ట్
నిన్న ఉదయం గోదావరి నీటిమట్టం చాలా ఉదృతంగా ఉండడంతో ముంపు మండలాల ప్రజలు భయాందోళనలో బిక్కుబిక్కుమన్నారు కానీ క్రమంగా భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. నేడు కూడా వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications