ఇంటిలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ; బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చకుంటే ఆ పని చెయ్యండి!!
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఐజి కి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతుందని, దానిని మార్చాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనితీరుపై ఎమ్మెల్యే రాజా సింగ్ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం హఠాత్తుగా రోడ్డుమీద ఆగిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్ ఈ మేరకు ఇంటిలిజెన్స్ ఐజీ కి లేఖ రాశారు.

బుల్లెట్ ప్రూఫ్ వాహనం విషయంలో ఇంటిలిజెన్స్ ఐజీకి లేఖ రాసిన రాజా సింగ్
తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతుందని, ఇక ఈ విషయం చెప్పినా రిపేర్ చేసి అదే వాహనాన్ని తనకు మళ్లీ కేటాయిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ వాహనం ఎక్కడపడితే అక్కడ మార్గమధ్యలో నిలిచిపోతుందని ఈ క్రమంలో అత్యవసర పరిస్థితిలో తను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని అందులో పేర్కొన్నారు. ఇక ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారని, అయితే అందులో తన పేరు లేకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని రాజా సింగ్ పేర్కొన్నారు.

బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చకపోతే ఇప్పుడున్న వాహనం కూడా తీసుకెళ్ళండి
తనకు నక్సలైట్ల నుండి ముప్పు ఉన్న విషయం పోలీసులకు తెలుసని, అయినప్పటికీ తన భద్రత విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని రాజాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక తనకు కొత్త వాహనం ఇవ్వడానికి కేటీఆర్ అనుమతి లేదా అని రాజసింగ్ ప్రశ్నించారు. లేకపోతే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చకపోతే, తనకు కేటాయించిన వాహనాన్ని తీసుకు వెళ్లాలని, ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్న పాత వాహనాన్నితాను వినియోగించలేను అని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు.

ధనికరాష్ట్రం అయిన తెలంగాణాలో ఈ పరిస్థితి దారుణం
ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ రాజా సింగ్ సెటైర్లు వేశారు. ఇక అంతకు ముందు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై ఆగిపోవడంతో తమకు కేటాయించిన వాహనంపై అసహనం వ్యక్తం చేసిన రాజాసింగ్ మాలాంటి శాసనసభ్యులకు ఇలాంటి వాహనాలు ఇచ్చి, టిఆర్ఎస్ నాయకులకు సరికొత్త అధునాతన మోడళ్లను కేటాయిస్తున్నారు అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications