వేధింపులు తట్టుకోలేక పోతున్నా.. పార్టీ నుంచి వెళ్లిపోతా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ దూసుకెళ్తోంది. గ్రామీణ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తోంది. ఇటీవల 19 జిల్లాలకు అధ్యక్షులను నియమించి విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో నాలుగు జిల్లాలకు తాజాగా అధ్యక్షులను నియమించింది. యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకురు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సి. గోదావరి, మహబూబాబాద్ కు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ- గోషా మహల్ కు టి. ఉమామహేంద్ర నియమించారు.
అయితే ఈ నియామకాలు పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లు పార్టీలో కష్టపడ్డ వాళ్లకు కాకుండా కాకా పట్టినవాళ్లకు పదవులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నుండి వెళ్లిపోతా..
పార్టీలో చేరినప్పటి నుంచి తనను వేధింపులకు గురిచేస్తున్నారని..వాటిని తట్టుకోవడం తన వల్ల కావట్లేదని ఆరోపణలు చేశారు. పార్టీకి తన అవసరం లేదనుకుంటే పార్టీ నుండి బయటకు వెళ్లిపోవడానికి తాను సిద్ధమేనని బాంబ్ పేల్చారు. తాను సూచించిన వ్యక్తిని కాదని ఎంఐఎంతో కలిసి ఉన్న వ్యక్తికి గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. బీసీ లేదా ఎస్సీ నేతకు ఆ పదవి ఇవ్వాలని తాను సూచించినట్లు రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
నా డిమాండ్ ఇదే..
"నేను బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ లతో పోరాటం చేస్తూ వచ్చా.. ఇప్పుడు సొంత పార్టీపైనే పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరం. జిల్లా అధ్యక్ష పదవిని ఎప్పుడైనా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికే ఇవ్వడం జరుగుతుంది. కానీ గోల్కొండ విషయంలో నా మాటను ఎందుకు పక్కన పెట్టారు? వెంటనే ఆ వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నా" అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications