ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు: హైదరాబాద్‌లో బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు
BJP MP Ramesh Bidhuri: కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు రోడ్డెక్కుతున్నారు. బిధూరి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తోన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
ప్రియాంక గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేశారు రమేష్ బిధూరి. అసభ్యకరంగా మాట్లాడారు. ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా నునుపుగా ఉండేలా రోడ్లను వేస్తామంటూ హామీ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా సంగం విహార్, కల్కాజీ, సుధార్ క్యాంప్, ఓఖ్లా వంటి ప్రాంతాల్లో అవుటర్, ఇన్నర్ రోడ్లను వేస్తామని అన్నారు. గతంలో రోడ్లను లాలూ ప్రసాద్ యాదవ్ హేమామాలిని బుగ్గలతో పోల్చారని గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ఇందులో భాగంగా- ఈ ఉదయం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. కార్యాలయంపైకి కోడిగుడ్లు విసిరారు. అక్కడే బైఠాయించారు. రమేష్ బిధూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
దీనితో ఉద్రిక్తత నెలకొంది. మొజాంజాహి మార్కెట్ మెయిన్ రోడ్డు నుంచి బీజేపీ కార్యాలయం వైపు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరి కొందరు వేరే మార్గం గుండా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లను పార్టీ కార్యాలయంపైకి విసిరారు.
దీనతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ కార్యకర్తల్లో ఒకరి తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications