అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై, ఆయన మేనల్లుడు హరీష్ రావుపై తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అల్లుడు హరీశ్‌రావు ఆణిముత్యమైతే.. మామ కేసీఆర్ స్వాతిముత్యమని ఆయన ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
గిరిజనులు, దళితులు, పేదల భిక్షతో గద్దెనెక్కినముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వారి సంక్షేమం విషయంలో మాట తప్పారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, రూ.3.5 లక్షలకే ఇల్లు కట్టిస్తానని చెప్పిన కెసిఆర్ పేదల ఎజెండాను పక్కన పెట్టి దొరల ఎజెండాను అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌లో దళిత, గిరిజన భవనాలను నిర్మిస్తానని చెప్పిన సీఎం గ్రామాల్లో అదే దళిత, గిరిజనులు నివసిస్తున్న గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మిస్తానని ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వినాయక నిమజ్జనాన్ని హుస్సేన్‌సాగర్‌లో కాకుండా కృత్రిమంగా నిర్మించే చెరువులో చేయాలని చెప్పడం తగదన్నారు.
ట్యాంక్‌బండ్ చుట్టూ 100 అంతస్తుల భవనాలను నిర్మిస్తామని చెబుతున్న కేసీఆర్ అలాంటి అద్దాల మేడలు దొరల కోసమేనన్నది తేటతెల్లమవుతోందన్నారు. వాటర్‌గ్రిడ్ పథకం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ అమరుల విగ్రహాలు పెట్టాలని, లేకుంటే తాము అధికారంలోకి వచ్చాక విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications