ఫోన్ ట్యాపింగ్: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఊరట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేశారనే కేసులో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి సోమవారం నాడు ఊరట లభించింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు స్టే ఇచ్చింది. విజయవాడ సిఎంఎం కోర్టు తీర్పు పైన అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కాల్ డేటా వివరాలు హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఏజీ కోర్టుకు విన్నవించారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన దస్త్రాల సమర్పణ కోసం విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు (సిఎంఎం) తనకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హైకోర్టును శనివారం ఆశ్రయించారు.

ఆగస్టు 17న ఇచ్చిన ఆ ఉత్తర్వుల పైన తదుపరి చర్యలు అన్నింటిని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, దానిని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.
మరోవైపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టుకు చేరిన నేపథ్యంలో ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా బెజవాడ సిఎంఎం న్యాయస్థానాన్ని ఆదేశించాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపు చేసేలా ఈ అంశంపై దర్యాఫ్తు చేస్తున్న ఏపీ సిట్‌ను ఆదేశించాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్ డేటా వివరాలను సిఎంఎం కోర్టుకు సీల్డు కవర్లో అందజేయాలని, వాటిని అందుకున్న కోర్టు వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లు సీల్డు కవర్లో సిఎంఎం కోర్టుకు దస్త్రాలను సమర్పించారని తెలిపారు.
అలాంటప్పుడు అదే కేసులో మళ్లీ తనకు నోటీసులు జారీ చేయడం న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే అన్నారు. తనను వేధింపులకు గురి చేయడం కోసం నోటీసు జారీ చేసినట్లుందన్నారు. సోమవారం ఇది విచారణకు రానుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!