అంగన్‌వాడీలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!!
తెలంగాణ ప్రభుత్వం వరుసగా ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ కి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది. సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా అంగన్వాడీలను చాలా నిర్లక్ష్య ధోరణితో చూస్తుంది. వారి సమస్యలను పట్టించుకోక పోవటంతో అంగన్వాడీలు అనేకసార్లు ఆందోళనల బాట పట్టారు.
అంగన్వాడీలకు సీతక్క శుభవార్త
తాజాగా తెలంగాణా ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా అంగన్వాడీ సిబ్బందికి సంబంధించిన మరో శుభవార్తను చెప్పింది. అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సేవలకు గాను టీచర్లకు, ఆయాలకు మంత్రి సీతక్క శుభవార్త తెలిపారు.

వారికి 2 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్
అంగన్వాడి స్కూల్స్ లో పనిచేసి పదవి విరమణ పొందిన టీచర్లకు ఇకనుండి రెండు లక్షల రూపాయలు ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీలలో పనిచేసే సహాయకులకు కూడా లక్ష రూపాయలు ఇస్తామని సీతక్క తెలిపారు. అంగన్వాడీలలో పనిచేసిన వారికి ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే జీవో జారీ చేస్తామని సీతక్క పేర్కొన్నారు.
అంగన్వాడీల కష్టాలు ప్రభుత్వానికి తెలుసు
అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క నేడు హైదరాబాద్లోని రెహమత్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన చేశారు. నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది కష్టాలు ప్రభుత్వానికి తెలుసని పేర్కొన్న సీతక్క, అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని వెల్లడించారు.
రెండు మూడు రోజుల్లో జీవో జారీ
ఈ మేరకు మరో రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంత్రి సీతక్క ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన జీవో త్వరలోనే విడుదల చేయాలని, తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరుతున్నారు. శుభవార్త చెప్పిన సీతక్కకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు.












Click it and Unblock the Notifications