తెలంగాణాలో బీహార్ నమూనా: కేసీఆర్ కోటరీగా బీహారీ అధికారులు; సీఎస్ పైనా రేవంత్ రెడ్డి సెన్సేషన్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ లో సమస్యల వల్ల హత్యలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిన్న హైదరాబాద్ లో కర్ణం గూడా లో జరిగిన హత్యలకు కూడా భూవివాదాలు కారణమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ధరణిని అడ్డుపెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల భూ అక్రమాలు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్ కోటరీగా బీహార్ కు చెందిన అధికారులు
బీహార్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కెసిఆర్ తన కోటరీ గా పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
అర్హత లేకున్నా సోమేష్ కుమార్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమేష్ కుమార్, అంజని కుమార్ లాంటి బీహార్ రాష్ట్రానికి చెందిన వారికి తెలంగాణ కీలక శాఖలో పదవులను కట్టబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ లకు కనీస శాఖలు కూడా లేవు
157 మంది ఐఏఎస్ అధికారులలో ప్రతిభ ఉన్న అధికారులు లేరా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, రజత్ కుమార్ లాంటి వారికి ఒక్కొక్కరి వద్ద 4 నుండి 5 శాఖలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ లకు కనీసం శాఖలు కూడా కేటాయించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులకు పెద్దపీట వేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

అర్హత లేని సోమేశ్ కుమార్ కు పదవి
ఎనిమిదేళ్లపాటు సర్వీస్ లోనే లేని సోమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అర్హత లేకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని సోమేశ్ కుమార్ కు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనకు చీఫ్ సెక్రటరీ పదవిని ఇచ్చినందుకు సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమేశ్ కుమార్ సర్వీస్ లెక్క తీస్తే ఆయనకు ప్రిన్సిపల్ సెక్రెటరీ మాత్రమే దక్కాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అర్హత లేని వ్యక్తికి చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
Recommended Video

తెలంగాణా నమూనా పోయి రాష్ట్రంలో బీహార్ నమూనా వచ్చింది
సోమేష్ కుమార్ రికార్డులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని 2020 ఫిబ్రవరిలో ఆర్టీఐ ద్వారా అడిగితే ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నమూనా పోయి రాష్ట్రంలో బీహార్ నమూనా వచ్చిందని కెసిఆర్ చేసిన పని తెలంగాణ ఉనికికి ప్రమాదం కానుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని నిజాం కాలం నాటి భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications