ఆ జిల్లాపై రూ.600 కోట్ల వరాలు కురిపించిన రేవంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లాలో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ప్రతి పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 200 కోట్ల చొప్పున వ్యయంతో ఇవి నిర్మితం కానున్నాయి. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇదే వేదికపై- 1,614 స్వయం సహాయక సంఘాలతో కూడిన ఇందూరు జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కులను అందించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వ్యవసాయానికి మారుపేరయిన నిజామాబాద్ జిల్లా దేశానికే ఆదర్శమని, ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

రూ. 20 కోట్లతో డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్శిటీ ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ- ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయిలో సిబ్బంది నివాస గృహాలు అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
అలాగే- ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రూ. 8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్, యూనివర్సిటీలో 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ. 43 కోట్ల అంచనా వ్యయంతో వర్సిటీ ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనాల విస్తరణ పనులు పనులు వంటివి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ. 18 కోట్లతో చేపట్టిన యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు పీ సుదర్శన్ రెడ్డి, మహ్మద్ షబ్బీర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications